రోహిత్ శర్మ కెప్టెన్సీపై కోహ్లీ చిన్ననాటి కోచ్ అనుచిత వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఓ వైపు రోహిత్ శర్మ కెప్టెన్సీని ప్రశంసిస్తూనే మరోవైపు భవిష్యత్తులో కష్టాలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం జట్టులో చేస్తున్న ప్రయోగాలు అంత మంచిది కాదని, భవిష్యత్తులో కష్టాలను తెచ్చిపెడతాయని చెప్పుకొచ్చాడు. ఇలానే ప్రయోగాలను కొనసాగిస్తే ఆస్ట్రేలియా వేదికగా జరిగే అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌కు టీమ్ సిద్దం కాదని తెలిపాడు. సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకున్న అనంతరం.. టీమిండియా పగ్గాలను అందుకున్న రోహిత్.. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు.

టీమిండియా సెట్ అవ్వలేదు..
సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలోనే ఖేల్‌నీతి అనే యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన రాజ్‌కుమార్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో సాధించిన విజయాలను తేలికగా తీసిపారేసాడు. 'రోహిత్ శర్మ ప్రశాంతమైన కెప్టెన్. అతని సారథ్యంలో టీమిండియా అద్భుత విజయాలు అందుకుంటుంది. కాకపోతే రోహిత్ సారథ్యంలో టీమిండియా ఇంకా సెట్ అవ్వలేదు. ప్రతి సిరీస్‌కు జట్టును మారుస్తూ ప్రయోగాలు చేస్తున్నారు.

ప్రయోగాలు బెడిసి కొడుతాయి..
ఇలా చేస్తే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నాటికి జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా తయారు అవుతుంది. ఇటీవల కాలంలో ఒక్కో ఆటగాడు ఒక్కో సిరీస్‌లో రాణించాడు. ఇలా రాణించిన ఆటగాళ్లను రెస్ట్ పేరుతో పక్కకు పెట్టడం సబబు కాదు. ఇది ఇలానే కొనసాగితే రోహిత్ శర్మకు కష్టాలు తప్పవు. ఇలా ప్రయోగాలు చేసుకుంటూ పోతే, ఏదో ఒక సిరీస్‌లో జట్టుకు తీరని నష్టం జరుగుతుంది. అప్పుడు రోహిత్‌కు అసలు సిసలు సవాల్ ఎదురవుతుంది. టీమ్ ఓపెనర్ల విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఒక్కో సిరీస్‌కు ఒక్కో ప్లేయర్‌తో రోహిత్ ఓపెనింగ్ చేశాడు. టీమ్ ఇంకా సెట్ అవ్వలేదని చెప్పడానికి ఇలాంటి ఉదహారణలు చాలా ఉన్నాయి.'అని రాజ్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డాడు.

టెస్ట్ కెప్టెన్‌గా..
టీ20, వన్డే కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ సాధించిన రోహిత్ శర్మ.. శుక్రవారం నుంచి శ్రీలంకతో జరగనున్న తొలి టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి జట్టును నడిపించనున్నాడు. ఈ మ్యాచ్‌తో టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్ మారనున్నాడు. మరోవైపు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది కెరీర్‌లో 100వ మ్యాచ్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు అయిన అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, వృద్దిమాన్ సాహాలపై సెలెక్షన్ కమిటీ వేటు వేయడంతో వీరి ప్లేస్‌ల్లో జట్టులోకి వచ్చే ఆటగాళ్లు ఎవరు? టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనే చర్చ తీవ్రమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications