చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు. పేలవ ప్రదర్శన నేపథ్యంలో టీమ్ ఓనర్ కావ్య మారన్ పడే బాధను తాను చూడలేకపోతున్నానని తెలిపారు. అప్‌కమింగ్ సీజన్‌లోనైనా జట్టును బలోపేతం చేయాలని కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్‌కు సూచించారు.
గత నాలుగు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమవుతోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో అయితే ఎన్నడూ లేని విధంగా పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. కెప్టెన్ మార్చినా.. కోట్లు కుమ్మరించి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసినా సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత మారలేదు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లకు హాజరయ్యే కావ్య మారన్.. టీమ్ ఓటమిని తట్టుకోలేక ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ నెట్టింట వైరల్ అయ్యేవి. చాలా మంది ఫ్యాన్స్ ఆమె బాధను చూసి తల్లడిల్లిపోయేవారు. ఈ క్రమంలోనే జట్టు కంటే ఆమె చాలా ఫేమస్ అయ్యారు.
రజనీకాంత్ అప్‌కమింగ్ మూవీ 'జైలర్'ను కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ నిర్మించారు. ఈ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో తలైవా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ వైఫల్యాన్ని ప్రస్తావించారు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఓడినప్పుడు స్టేడియంలో కావ్య మారన్ నిరాశగా ఉండటం చూడలేకపోతున్నా.
ఆమె బాధ పడటం చూసి తట్టుకోలేక చాలా సందర్భాల్లో టీవీ ఛానెల్‌ను మార్చేసాను. కళానిధి మారన్‌ను నేను కొరేది ఒక్కటే. జట్టులోకి మంచి ఆటగాళ్లను తీసుకొని బలోపేతం చేయండి. వేలంలో మెరుగైన ఆటగాళ్లపై డబ్బులు ఖర్చు చేయండి. అప్‌కమింగ్ సీజన్‌లోనైనా కావ్య మారన్ ఎగిరి గంతేయడం మేం చూడాలి.'అని రజినీకాంత్.. కళానిధి మారన్‌ను కోరారు.

ప్రస్తుతం రజనీకాంత్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కూడా రజనీ కామెంట్స్‌తో ఏకీభవిస్తున్నారు. తాము కూడా కావ్య పాప బాధపడటం తట్టుకోలేకపోతున్నామని కామెంట్ చేస్తున్నారు. రూ.13.25 కోట్లు, రూ.8.75 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్ దారుణంగా విఫలమయ్యారు.
హెడ్ కోచ్ బ్రియాన్ లారా కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. అతని అనాలోచిత నిర్ణయాలు టీమ్ ఓటమిని శాసించాయి. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ ప్రక్షాళనకు దిగినట్లు తెలుస్తోంది. అప్‌కమింగ్ సీజన్‌లో కోచ్‌తో పాటు కీలక ఆటగాళ్లను మార్చనున్నట్లు తెలుస్తోంది.