ఏ ఒక్కడి మీద ఆధారపడకుండా.. సమష్టి ప్రదర్శనతోనే వరుస విజయాలు సాధిస్తున్నామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పటీదార్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ీ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన ఆర్‌సీబీ.. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్, బ్యాటింగ్ చేశామని చెప్పాడు.
'ఇది ఏ ఒక్కరి విజయమో కాదు. సమష్టి విజయం. బౌలర్లు తమ ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారు. నేను ముందుగా చెప్పినట్లు మేం ఏ వేదికగా ఆడుతున్నామని చూడటం లేదు. మెరుగైన క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం. ఛేజింగ్ చేస్తే వికెట్‌పై స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈ మ్యాచ్‌లో ప్రణాళికలకు తగ్గట్లే మా బౌలింగ్, బ్యాటింగ్ సాగింది.

ఇది సునాయసంగా చేధించాల్సిన లక్ష్యం. బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేశారు. ఈ గెలుపు క్రెడిట్ వారిదే. ఛేజింగ్‌లో మేం స్పష్టమైన ప్రణాళికతో బరిలోకి దిగాం. ఆర్‌సీబీ వంటి జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప అనుభూతినిస్తోంది. ఈ జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. వారి నుంచి నేర్చుకునేందుకు ఇది నాకు మంచి అవకాశం.'అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(41), ట్రిస్టన్ స్టబ్స్(34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/33) మూడు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, కృనాల్ పాండ్యాకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం ఆర్‌సీబీ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 165 పరుగులు చేసి గెలుపొందింది. కృనాల్ పాండ్యా(73 నాటౌట్), విరాట్ కోహ్లీ(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా.. చమీర ఒక వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.