ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు తమ మ్యాచ్ విన్నర్ జాకోబ్ డఫీ దూరమయ్యాడని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పటీదార్ తెలిపాడు. తమ ప్రధాన పేసర్ జోష్ హాజెల్ వుడ్ అందుబాటులోకి రావడంతోనే డఫీని పక్కన పెట్టాల్సి వచ్చిందన్నాడు.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యంగా వేయగా.. మ్యాచ్ ప్రారంభానికి ముందు మరోసారి వర్షం రావడంతో ఆట ఇంకా మొదలవ్వలేదు. టాస్ సందర్భంగా మాట్లాడిన రజత్ పటీదార్.. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పాడు. భారీ సంఖ్యలో హాజరైన ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు.

'ఇది మా మొదటి అవే మ్యాచ్. ఈ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో హాజరైన ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు. ఈ మైదానంలో ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ను చూస్తుంటే.. ఇది మా సొంత మైదానమేమో అనే అనుభూతిని కలుగుతుంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. దురదృష్టవశాత్తు.. ఈ మ్యాచ్‌లో జాకోబ్ డఫీ ఆడటం లేదు. అతని స్థానంలో జోష్ హాజెల్‌వుడ్ బరిలోకి దిగుతున్నాడు.
గత మ్యాచ్‌ల్లో డఫీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ జోష్ అనుభవజ్ఞుడైన స్పెషలిస్ట్ బౌలర్. అతని రాక జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని నేను భావిస్తున్నా.'అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్.. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకున్నట్లు వివరించాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. నిజానికి ఇది పొడిగా ఉండాల్సిన వికెట్. కానీ గత రెండు రోజులుగా వర్షం పడుతోంది. ఈరోజు కూడా కొద్దిగా పడింది. కాబట్టి పిచ్‌లో కొంత తేమ ఉండే అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాం. టోర్నీ ప్రారంభానికి ముందు నుంచే మేం చాలా స్పష్టమైన ప్రణాళికలతో ఉన్నాం.
చాలా స్మార్ట్ క్రికెట్ ఆడాలని, వ్యూహాత్మకంగా ఉండాలని నేను టీమ్‌కు చెప్పాను. గత మూడు మ్యాచ్‌ల్లో లాగే పరిస్థితులకు అనుగుణంగా ఆడి విజయం సాధిస్తామని ఆశిస్తున్నా. తుషార్ దేశ్‌పాండేకు విశ్రాంతినిచ్చి.. బ్రిజేష్ శర్మను జట్టులోకి తీసుకున్నాం. ముంబైపై గెలిచిన వెంటనే.. అది గతం అని, కొత్తగా ప్రారంభించాలని జట్టుకు చెప్పాను. మా కోచ్ సంగక్కర కూడా హోటల్ నుంచి బయలుదేరే ముందు ఇదే చెప్పారు. గత మూడు మ్యాచ్‌ల విజయాలు గతం.. ఈరోజు మనం రాణించాలి. లేకపోతే రెండు పాయింట్లు కోల్పోతాం. మా బ్యాటింగ్ విభాగం, మా టీమ్ జైత్రయాత్రను కొనసాగించాలని కోరుకుంటున్నా.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
రాజస్థాన్ రాయల్స్ (RR):
యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):
విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జోష్ హాజిల్‌వుడ్.