ఐపీఎల్ 2026 వేలానికి ముందు తనను రిలీజ్ చేయాలని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి సంజూ శాంసన్‌కు ఆఫర్ వచ్చిందని, రాజస్థాన్ రాయల్స్‌తో ట్రేడింగ్ డీల్‌పై చర్చలు జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సంజూ శాంసన్‌ను వదులుకునేందుకు అంగీకరించిన రాజస్థాన్ రాయల్స్ అతనికి బదులుగా ఇద్దరు ఆటగాళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందంట.
అయితే ఆ జట్టు మాజీ స్పిన్నర్, సీఎస్‌కే ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు మరో ఆటగాడిని సంజూకు బదులుగా రాజస్థాన్ రాయల్స్ అడుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ తాజా కథనం ప్రకారం అశ్విన్‌ను రాజస్థాన్ రాయల్స్ అడగడం లేదంట. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు రుతురాజ్ గైక్వాడ్‌ను సంజూ శాంసన్‌కు బదులుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తుందంట. అయితే సీఎస్‌కేకు ఈ ఇద్దరు ఆటగాళ్లు చాలా కీలకం. రుతురాజ్ గైక్వాడ్ సీఎస్‌కే కెప్టెన్. అలాంటి ఆటగాళ్లను సీఎస్‌కే ఎట్టిపరిస్థితుల్లో వదులుకోదు. ఈ క్రమంలోనే ఈ తరహా డీల్‌కు సీఎస్‌కే నిరాకరిస్తోంది.

శివమ్ దూబేను ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ సీఎస్‌కే మాత్రం తమ జట్టులోని ఏ ఆటగాడిని ఇవ్వలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సంజూ శాంసన్‌ను వదులుకునే ఉద్దేశం లేకనే రాజస్థాన్ రాయల్స్ ఈ కండిషన్స్ పెడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రేడింగ్ డీల్స్‌పై చర్చలు జరపడం లేదా వేలంలో కొనుగోలు చేయడం తప్పా సీఎస్‌కే ముందు మరో ఆప్షన్ లేదు.
అయితే సంజూ శాంసన్ వేలంలోకి వస్తాడనే గ్యారంటీ లేదు. కేకేఆర్ కూడా ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌ను తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాకుండా రూల్స్ ప్రకారం సంజూ శాంసన్‌ను రిలీజ్ చేసే విషయంలో తుది నిర్ణయం ఫ్రాంచైజీదే. ఆటగాళ్లు రిక్వెస్ట్ చేయడం తప్పా ఏం చేయలేరు.