శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం అందుకోలేకపోయింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా టై చేసుకుంది. రెండు వికెట్లను చేతులో పెట్టుకొని 18 బంతుల్లో 5 పరుగులు చేయలేకపోయింది.
శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్ వరుస బంతుల్లో ఔటవ్వడంతో మ్యాచ్ టైగా మారింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసింది. ధునిత్ వెల్లలాగే 65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 నాటౌట్), నిస్సాంక (56) అర్ధశతకాలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (2/33), అర్షదీప్ సింగ్ (2/47) తలో రెండేసి వికెట్లు తీశారు.

రోహిత్ రాణించినా..
అనంతరం భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ ( 47 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్ ( 57 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్ ( 43 బంతుల్లో, 2 ఫోర్లతో 31), విరాట్ కోహ్లీ ( 32 బంతుల్లో, 2 ఫోర్లతో 24), శ్రేయస్ అయ్యర్ ( 23 బంతుల్లో, 4 ఫోర్లతో 23) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో హసరంగ (3/58), అసలంక (3/30) మూడేసి వికెట్లు తీయగా.. వెల్లలాగే రెండు వికెట్లతో సత్తాచాటాడు.
అయితే స్కోర్లు టై అవ్వడంతో సూపర్ ఓవర్ నిర్ణయిస్తారని అంతా భావించగా.. అంపైర్లు మ్యాచ్ ఫలితం తేలలేదని ముగించారు. ఐసీసీ రూల్స్ ప్రకారం ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో ఓ మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు సూపర్ ఓవర్‌ను నిర్వహించరు. ఐసీసీ టోర్నీలు, ముక్కోణపు సిరీస్‌లు, ఆసియా కప్ వంటి టోర్నీలో మాత్రం వన్డే ఫార్మాట్ అయినా ఫలితం తేల్చడం కోసం సూపర్ ఓవర్ ఆడిస్తారు. దాంతో తొలి మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసినట్లు అయ్యింది.
రెండో వన్డేకు భారీ వర్షం ..
ఈ మ్యాచ్ ముగిసిన మరో 48 గంటల్లోనే భారత్-శ్రీలంక మధ్య రెండో వన్డే జరగనుంది. ఆదివారం జరగనున్న ఈ కీలక పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ జరిగే కొలంబోలో ఉదయం భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. ఉదయం 10 గంటలకు 50 శాతం వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
అయితే కొలంబో మైదానంలో మంచి డ్రైనేజీ సిస్టమ్ ఉండటం కలిసొచ్చే అంశం. కానీ వర్షం ఆగితేనే ఆటకు మైదానం సిద్దం చేయగలరు. వర్షం అంతరాయం కలిగిస్తే కొన్ని ఓవర్లను కుదించి ఆడిస్తారు. ఆటకు సాధ్యం కాకపోతే మాత్రం రద్దు చేస్తారు. అప్పుడు బుధవారం జరిగే చివరి మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారుతోంది.