India vs Pakistan: యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్X పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఆదివారం కొలంబో వేదికగా దాయాదుల సమరానికి తెరలేవనుంది. పాకిస్థాన్ ప్రభుత్వం ఆడిన బాయ్ కాట్ డ్రామాతో ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితికి ఐసీసీ తెరదించినా.. మరో భారీ అడ్డంకి ఏర్పడింది. ఈ మ్యాచ్ వర్షార్పణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ ప్రకటన ఇప్పుడు క్రికెట్ అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. శ్రీలంక వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రత్యేక వాతావరణ బులెటిన్ వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 15 నాటికి ఆగ్నేయ బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ బులెటిన్‌లో శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్ప పీడనం ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

ఈ అల్పపీడన ప్రభావం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగే కొలంబోలోని ప్రేమదాస స్టేడియం సమీపంలో కూడా ఉండనుంది. మ్యాచ్ రోజు మైదానాన్ని మబ్బులు కమ్మేసే అవకాశం ఉందని, వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో స్పష్టమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్థాన్ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా వర్షంతో తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. గూగుల్ వెదర్ ఫోర్‌కాస్ట్ కూడా వర్షం పడే అవకాశం ఉందని సూచిస్తోంది.
వర్షంతో భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించనున్నారు. ఎందుకంటే ఇది లీగ్ మ్యాచ్ కావడంతో రిజర్వ్ డే లేదు. చెరో పాయింట్ లభిస్తే ఇరు జట్లు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సూపర్-8కు అర్హత సాధించనున్నాయి. అయితే బ్రాడ్‌కాస్టర్స్ తీవ్రంగా నష్టపోనుండగా.. అభిమానులు తీవ్ర నిరాశకు గురవ్వనున్నారు. ఈ మ్యాచ్ చుట్టూ రూ.4500 కోట్ల వ్యాపారం జరగనుంది. ఇప్పటికే కొలంబో ఫ్లైట్ టికెట్స్, హోటల్ రూమ్స్ ధరలు కొండెక్కాయి. ఈ మ్యాచ్ సజావుగా జరగాలని, పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.