టీమిండియా క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ రాహుల్ తెవాటియా సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ షేర్ చేశాడు. ఓ వైపు దేశవ్యాప్తంగా ఉన్న సెలెబ్రిటీలు అంతా.. పాలస్థీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఖండిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.
గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఉద్దేశించి సెలెబ్రిటీలు అంతా 'అందరి కళ్లు రఫాపైనే ఉన్నాయి'అనే ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. అయితే రాహుల్ తెవాటియా మాత్రం పాకిస్థాన్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాల అంశాన్ని లేవనెత్తారు. 'అందరి దృష్టి పాకిస్థాన్‌లోని హిందువులపై ఉంది'అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు.

రాహుల్ తెవాటియా పోస్ట్‌పై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. పాకిస్థాన్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను ధైర్యంగా లెవనెత్తడంపై తెవాటియాను ప్రశంసిస్తున్నారు. భారత్‌లోని ప్రముఖులు అంతా రాహుల్ తెవాటియాను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
రఫాలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయగా.. పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రతీ ఒక్కరిని కలిచివేసాయి. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన ప్రముఖులు పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. దాంతో 'అందరి కళ్లు రఫాపైనే ఉన్నాయి' అనే ఫోటో ట్రెండింగ్‌లో నిలిచింది.
రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్డే కూడా ఈ పోస్ట్‌ను షేర్ చేసింది. తీవ్ర విమర్శలు రావడంతో తొలగించింది. హిందువులపై దాడి జరిగినప్పుడు స్పందించారా? అంటూ కొంతమంది నెటిజన్లు రితికా సజ్దే ట్రోలింగ్‌కు దిగారు. కశ్మీర్ పండిట్లు, మణిపూర్‌లో హింసతో పాటు దేశంలో నెలకొన్న అనేక సమస్యలపై ఎప్పుడైనా స్పందించారా? అని రితికాను నిలదీసారు.
రితికాతో పాటు సినీతారలు సమంత, త్రిష, మాళవికా మోహనన్, రష్మిక, దుల్కర్ సల్మాన్, పార్వతి తిరువొత్తు, అమీ జాక్సన్, అలియా భట్, కరీనాకపూర్, ప్రియాంకా చోప్రా, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, దియా మీర్జా, త్రిప్తి డిమ్రిలు సోషల్ మీడియా వేదికగా తమ సంఘీభావాన్ని ప్రకటించారు.