
దాదా భరోసా ఇచ్చినా..
సొంతగడ్డపై శ్రీలంకతో జరగనున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సాహాతో పాటు సీనియర్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలను భారత సెలెక్టర్లు పక్కనపెట్టారు. సాహాను తీసుకోకపోవడానికి గల కారణాలను మీడియాకు చెప్పాల్సిన అవసరం తమకు లేదని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ అన్నాడు. అది సెలెక్టర్ల అంతర్గత వ్యవహారమని పేర్కొన్నాడు.
ఈ వ్యాఖ్యలతో కొంత ఆగ్రహానికి గురైన సాహా.. మీడియా ముందుకు వచ్చి బీసీసీఐ బండారాన్ని బయటపెట్టాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్‌పై ఆలోచన చేయమని సూచించాడని ఆరోపించాడు. అంతేకాకుండా కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో తన ఆటను ప్రశంసిస్తూ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ జట్టులో చోటుపై హామీ ఇచ్చాడని తెలిపాడు. అయినా తనను పక్కనపెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు.

సాహా అపార్దం చేసుకున్నాడు..
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన అతడు.. ద్రవిడ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు రిటైర్మెంట్ గురించి ఆలోచించమని ఆయన సలహా ఇచ్చాడని ఆరోపించాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నుంచి తనకు హామీ ఉన్నప్పటికీ జట్టులో స్థానం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో సాహా వ్యాఖ్యలపై ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన ద్రవిడ్.. తన సలహాను సాహా తప్పుగా అర్థం చేసుకున్నాడని చెప్పాడు.

సాహా అంటే గౌరవం..
‘భారత జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో సాహా భాగం అయ్యాడు. తన పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ఈ క్రమంలోనే తనతో మాట్లాడాను. అయితే, అతనికి ఈ విషయంలో క్లారిటీ అవసరం. నిజానికి అందరు ఆటగాళ్లతో ఎప్పుడూ మాట్లాడినట్లుగానే మాట్లాడాను. కాస్త నిజాయితీగా వ్యవహరించాల్సింది. మీడియా ద్వారా ఈ మాటలు వినాల్సి వస్తుందని అనుకోలేదు. అయినా ప్రతిసారి మనం ఇచ్చిన సలహాలు, సందేశాలు ప్రతి ఆటగాడికి నచ్చాలని లేదు కదా! అందుకే తన మాటలకు ఎక్కువగా బాధపడలేదు. మన అభిప్రాయాలతో ఏకీభవించని కారణంగా వాళ్లను తప్పుపట్టాల్సింది కూడా ఏమీలేదు.'అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

నిక్కచ్చిగా ఉంటాం..
అదే విధంగా జట్టు ఎంపిక విషయంలో తాను, కెప్టెన్ రోహిత్ శర్మ చాలా నిక్కచ్చిగా ఉంటామని చెప్పాడు. ‘జట్టు ఎంపిక విషయంలో నేను లేదంటే... రోహిత్... ఆటగాళ్లతో కచ్చితంగా మాట్లాడతాం. వాళ్లు ఎందుకు తుది జట్టులో లేరో.. అందుకు గల కారణాలు వివరిస్తాం. సెలక్ట్ అవ్వని వాళ్లు బాధపడటం సహజమే. అయినా, వాళ్ల పట్ల నాకున్న గౌరవం ఏమాత్రం తగ్గదు. నా జట్టు పూర్తి నిజాయితీ, క్లారిటీ కలిగి ఉండాలని నేను కోరుకుంటాను'' అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












