
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: తీరికలేని క్రికెట్ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినకూడదనే మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా ప్యాడీ అప్టన్‌ను తీసుకున్నామని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ప్యాడీ అప్టన్ విజ్ఞాన గని అని, క్రికెటర్ల మానసిక ఆరోగ్యంపై అతనికి అపారమైన జ్ఞానం ఉందన్నాడు. చాలా ముఖ్యమైన పరిస్థితుల్లో అతడెంతో ఉపయోగపడతాడని చెప్పాడు. అంతేకాకుండా 2011 ప్రపంచకప్‌లో భారత జట్టుతో పని చేసిన అనుభవంతో పాటు ఐపీఎల్‌లో పనిచేసి ఎక్స్‌పిరియన్స్ ఉందన్నాడు. అంతకు మించి భారత జట్టు సంప్రదాయాలు అతనికి బాగా తెలుసన్నాడు.
'చాలా క్రికెట్ ఆడుతున్న ఈ రోజుల్లో మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టడం చాలా ముఖ్యం. అప్టన్ వంటి పరిజ్ఞానమున్న వ్యక్తి జట్టుతో ఉండడం భారత జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. అతడు మెంటల్ కండిషనింగ్ కోచ్ జట్టుతో చేరడం మా అదృష్టం. 2011లో భారత జట్టులో కలిసి పనిచేసిన అనుభవం అతనికి ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఐపీఎల్‌లో, టీమిండియా తరఫున పని చేసిన అతనికి చాలా మంది భారత క్రికెటర్లపై అవగాహన ఉంది. మన సంప్రదాయం కూడా అప్టన్‌కు బాగా తెలుసు. భారత జట్టు ఎలా పనిచేస్తుందో తెలుసు. మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా సరిగ్గా సరిపోతాడు. టీ20 ప్రపంచకప్‌కు జట్టును సిద్ధం చేయాలనుకుంటున్న మేం అతడి జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాం.' అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
ఇక ప్యాడీ అప్టన్‌ను భారత జట్టులోకి తీసుకోవడంపై భారత మాజీ పేసర్, వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్యాడీ అప్టన్ ఓ వేస్ట్ గాడని, అతనితో ఒరిగేదేంలేదని మండిపడ్డాడు. అద్భుతాలు చేయడం అతనికి చేతకాదని వ్యాఖ్యానించాడు. ఒకవేళ భారత్ టీ20 ప్రపంచకప్ గెలిస్తే ఆ ఘనత ఆటగాళ్లు, హెడ్ కోచ్ ద్రవిడ్ భాయ్‌కు మాత్రమే దక్కుతుందని అభిప్రాయపడ్డాడు.
2011 వన్డే ప్రపంచకప్ విజయంలో అప్టన్ పాత్ర కేవలం ఒక శాతం మాత్రమేనని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. '99 శాతం పనిని పూర్తి చేసింది గ్యారీ కిర్‌స్టన్.. అప్టన్ ఆయనకు కేవలం అసిస్టెంట్ మాత్రమే. రాజస్థాన్ రాయల్స్‌లో భాగంగా రాహుల్ భాయ్‌తో కలిసి పనిచేశాడు కాబట్టే మళ్లీ టీమిండియా సిబ్బందిలో భాగం కాగలిగాడు. నిజానికి అతను మంచి యోగా టీచర్. కాబట్టి రాహుల్ భాయ్ కచ్చితంగా అతని సేవలు వాడుకుంటాడు'అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.