Rahul Dravid: ఈ విజయాన్ని తలకెక్కించుకోవద్దు.. భారత ఆటగాళ్లకు హెడ్ కోచ్ వార్నింగ్!

కోల్‌కతా: న్యూజిలాండ్‌పై సాధించిన సిరీస్ విజయాన్ని ఏమాత్రం తలకెక్కించుకోవద్దని టీమిండియా ఆటగాళ్లను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ హెచ్చరించాడు. ఈ ఒక్క విజయంతోనే పొంగిపోకుండా నేలపై ఉంటూ.. భవిష్యత్తు టోర్నీలపై దృష్టిసారించాలన్నాడు. వాస్తవానికి బిజీ షెడ్యూల్ కారణంగా బలమైన న్యూజిలాండ్ బలహీనంగా మారిందని, మెగా టోర్నీ అనంతరం వారం రోజుల వ్యవధిలోనే మరో సిరీస్ ఆడటం అంత తేలికైన విషయం కాదన్నాడు. అయితే తొలి టోర్నీనే ఇలా క్లీన్ స్వీప్ విజయంతో ఆరంభించడం సంతోషాన్నించిందన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ 73 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. దాంతో సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

పొంగిపోవద్దు..
మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్ల ప్రదర్శనను కొనియాడుతూ ఈ విజయంపై హర్షం వ్యక్తం చేశాడు. 'ఈ సిరీస్‌లో ప్రతి ఒక్కరూ బాగా ఆడారు. ఈ సిరీస్ విజయం అద్భుతం. అయితే ఈ విజయంతో పొంగిపోకుండా భారత ఆటగాళ్లు నేలపై ఉండాలి. వాస్తవంగా న్యూజిలాండ్ బలమైన జట్టు. ఇటీవల పూర్తయిన ప్రపంచకప్ ఫైనల్ ఆడటం.. వారం రోజుల్లో మరో టీ20 సిరీస్ ఆడటం ఆ జట్టుపై ప్రభావం చూపింది. వారం రోజుల వ్యవధిలో మరో సిరీస్ ఆడటం ఏ జట్టుకైనా అంత తేలిక కాదు. టీమిండియా గెలవడం బాగున్నా.. నేర్చుకోవాల్సిన విషయాలు, మెరుగుపడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

టార్గెట్ ప్రపంచకప్
వచ్చే ప్రపంచకప్ వరకు సుదీర్ఘ ప్రయాణం ఉంది. అందులో గెలుపోటములు చూడాలి. ఈ సిరీస్‌లో పలువురు యువకులు అవకాశం దక్కించుకొని రాణించడం బాగుంది. ఇకపై వారికి మరిన్ని అవకాశాలిచ్చి ప్రోత్సహించాలి. అలాగే ఇంకొంత మంది ఫామ్‌లోకి రావడంతో జట్టు బలంగా మారింది. యువకులు రాణించడం అనేది గొప్ప విషయం. దీంతో అందర్నీ కలిపి ఆడించవచ్చు. ఇక్కడి నుంచి వచ్చే ప్రపంచకప్ దాకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. మరోవైపు నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు వీరిలో కొంత మంది యువకులే ఎంపికయ్యారు. వారిని ఇకపై కాస్త త్వరగా నిద్రపోమని చెప్తా. ఎందుకంటే టెస్టు మ్యాచ్‌లు ఉదయం 9:30కే ప్రారంభమవుతాయి. వారు.. 7:30 కల్లా మేలుకోవాలి' అని ద్రవిడ్ సరదాగా చెప్పుకొచ్చాడు.

రోహిత్ సూపరో సూపర్..
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' కెప్టెన్ రోహిత్ శర్మ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 29; 6 ఫోర్లు) మెరిశారు. చివర్లో దీపక్ చహర్ (8 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఆటతీరుతో భారత్ భారీ స్కోరు ను అందుకుంది. ఛేదనలో న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ గప్టిల్ (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా మిగిలినవారు విఫలమయ్యారు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అక్షర్ పటేల్ (3/9), హర్షల్ పటేల్ (2/26) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. న్యూజిలాండ్ తాత్కాలిక సారథి సౌతీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ మ్యాచ్‌లో సాన్‌ట్నర్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు.

గురువారమే ఫస్ట్ టెస్ట్..
మూడు టీ20ల సిరీస్ ముగియడంతో ఇరు జట్ల మధ్య జరగాల్సిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. నవంబరు 25- 29 వరకు ఈ మ్యాచ్ జరగనుండగా.. డిసెంబరు 3- 7 వరకు ముంబై వేదికగా రెండో టెస్టు జరుగనుంది. ఇక ఈ సిరీస్ నుంచి టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్ విశ్రాంతి తీసుకోగా.. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. దాంతో ఫస్ట్ మ్యాచ్‌లో అజింక్యా రహానే భారత జట్టును నడిపించనుండగా.. పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వికెట్ కీపర్లుగా వృద్దీమాన్ సాహా, తెలుగు క్రికెట్ కేఎస్ భరత్‌లు చోటు దక్కించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications