ఇంగ్లండ్ బ్యాటర్ ఓలిపోప్‌ను త్వరగా ఔట్ చేయకపోవడం.. తొలి ఇన్నింగ్స్‌లో 70-80 పరుగులు తక్కువగా చేయడం హైదరాబాద్ టెస్ట్‌లో తమ ఓటమిని శాసించిందని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో శుభారంభం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం అందుకున్న తర్వాత కూడా టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలవలేకపోయింది. ఈ మ్యాచ్ ఫలితంపై స్పందించిన రాహుల్ ద్రవిడ్.. కీలక సమయంలో బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం ఓటమికి కారణాలయ్యాయని తెలిపాడు.

'తొలి ఇన్నింగ్స్‌లో మా జట్టు మరిన్ని పరుగులు చేయాల్సింది. ముగ్గురు బ్యాటర్లు 80 పరుగుల్లోపే ఔటయ్యారు. తృటిలో శతకాలు చేసుకునే అవకాశాలను చేజార్చుకున్నారు. 70-80 పరుగులు అదనంగా చేయాల్సిది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. తొలి రెండు రోజులు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అప్పుడే ఇంకొన్ని పరుగులు ఎక్కువ చేయాల్సింది.
కొన్ని మంచి ఆరంభాలు దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఒక్క బ్యాటరైనా శతకం సాధించి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. టెస్ట్‌ల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ కష్టమే. 230 పరుగులే అయినా చేధించడం కష్టం. జట్టులో కుర్రాళ్లు ఉన్నారు. దేశవాళీ క్రికెట్‌లో చాలా మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నా.. ఇలాంటి పరిస్థితులు వారికి కొత్త.
అంతర్జాతీయంగా ఈ తరహా పరిస్థితులను ఎదుర్కొనేందుకు వారికి కాస్త సమయం పడుతోంది. కుర్రాళ్ల నైపుణ్యాలకు ఇది అసలు సిసలు పరీక్ష. తుదపరి మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నా. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్(196) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. భారత బౌలర్లను స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
అతని బ్యాటింగ్‌కు తగ్గట్లు మా బౌలర్లు వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అతన్ని ఔట్ చేయడంలో మా బౌలర్లు విఫలమయ్యారు. ఈ తప్పిదాలను సవరించుకొని తదుపరి మ్యాచ్‌లో బరిలోకి దిగుతాం.'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్(70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. జడేజా, అశ్విన్ మూడేసి వికెట్లు తీసారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగుల భారీ స్కోర్ చేసింది. రవీంద్ర జడేజా(87), యశస్వి జైస్వాల్(80), కేఎల్ రాహుల్(86) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
దాంతో భారత్‌కు 190 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్.. ఓలిపోప్(196) సూపర్ బ్యాటింగ్‌తో 420 పరుగులు చేసింది. దాంతో భారత్ ముందు 231 పరుగుల లక్ష్యం నమోదైంది. కానీ భారత్ 202 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది.