రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచాడు. దేశంలో ఎవర్నీ కదిలించినా.. ఏ సోషల్ మీడియా వేదిక చూసినా.. ఈ 14 ఏళ్ల కుర్రాడి గురించే చర్చ జరుగుతుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 35 బంతుల్లో సెంచరీ సాధించి టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు.
సూర్యవంశీ ధాటికి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 25 బంతులు మిగిలి ఉండగానే చేధించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌లో 5 వరుస పరాజయాల తర్వాత విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీ సెంచరీతో ఆ జట్టు ఆటగాళ్లు ఎగిరి గంతేసారు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే రాహుల్ ద్రవిడ్ సైతం గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. లెగ్ ఫ్రాక్చర్ కావడంతో వీల్ చైర్ సాయంతో హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాహుల్ ద్రవిడ్.. సూర్యవంశీ సెంచరీ చేసిన ఆనందంలో ఆ విషయం మరిచి ఎగిరి గంతేసాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రాహుల్ ద్రవిడే కాదు.. గుజరాత్ టైటైన్స్ ఆటగాళ్లు సైతం సూర్యవంశీకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అయితే సూర్యవంశీ బ్యాటింగ్ సందర్భంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నోట్ బుక్స్‌లో ఏదో రాస్తూ కనిపించాడు. బహుషా అతని బ్యాటింగ్ లోపాలను నోట్ చేసుకొని ఉండొచ్చు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ హోమ్ వర్క్ రాహుల్ ద్రవిడ్ చేస్తున్నారని ఫన్నీగా పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి.
ప్రస్తుతం వైభవ్.. బీహార్, తాజ్‌పూర్‌లోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. క్రికెట్ కారణంగా అతను తన చదవుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. క్రికెట్ టోర్నీలు లేని సమయంలో మాత్రమే స్కూల్‌కు వెళ్తున్నాడు. అయితే చదువు, ఆటను వైభవ్ బ్యాలెన్స్ చేస్తున్నాడని అతని చిన్ననాటి కోచ్ బ్రజేష్ మీడియాకు తెలిపారు.