రోహిత్ శర్మ సెల్ఫెలెస్ కెప్టెన్సీతోనే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచామని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆటగాళ్లదేనని స్పష్టం చేశాడు.వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించిన రోహిత్ సేన.. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత మరో ఐసీసీ టైటిల్‌ను అందుకుంది. ఈ విజయానంతరమే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.
దాంతో అప్‌కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా సన్నదమైంది. ఈ వరల్డ్ కప్ సైకిల్‌లో సూర్య సేన ఆడిన 9 సిరీస్‌లకు 9 గెలిచి హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. అయితే ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఏ జట్టు వరుసగా టైటిళ్లు గెలవలేదు. అంతేకాకుండా ఆతిథ్య జట్టు ఇప్పటి వరకు టైటిల్ అందుకోలేదు. ఈ క్రమంలోనే భారత్ పటిష్టంగా ఉన్నా.. టైటిల్ గెలుస్తుందా? అంటే 100 శాతం అవును అని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
తాజాగా రాహుల్ ద్రవిడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తున్నా.. ఒక్క బ్యాడ్ డే అంత తలకిందులు చేస్తుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. 'ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే జట్లలో టీమిండియా హాట్ ఫేవరేట్. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈజీగా సెమీఫైనల్ చేరుకుంటుంది.
అయితే నా చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే.. జట్టు ఎంత బలంగా ఉన్నా.. మ్యాచ్ రోజు ఎంత బాగా ఆడుతారనేది ముఖ్యం. ఎవరైనా సరే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును దెబ్బతీయగలరు. భారత జట్టు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ, ఒక చెడు దినం అంతా తలకిందులు చేయగలదు.'అని రాహుల్ ద్రవిడ్ హెచ్చరించాడు.

రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడే టీమిండియా వైట్‌బాల్ ఫార్మాట్ గేమ్ పూర్తిగా మారిపోయింది. దూకుడు అప్రోచ్ అతని పర్యవేక్షణలో మొదలైంది. అయితే టీమిండియా ఇలా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ అని ద్రవిడ్ తెలిపాడు. నాయకుడిగా అతనే సెల్ఫెలెస్‌గా ఆడి ఇతర ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడని గుర్తు చేసుకున్నాడు. అతని నిస్వార్థమైన బ్యాటింగ్‌తోనే ప్రపంచకప్‌లో తమ జట్టు విజేతగా నిలిచిందన్నాడు.
'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ వెనుకంజలో ఉందని, జట్టు పరిధిని ఇంకాస్త పెంచాలని ఒకానొక సమయంలో నాకు అనిపించింది. ఆటలో రన్‌రేట్లు పెరుగుతున్నాయి. రిస్క్ తీసుకునే ధోరణి వచ్చింది. కాలానికి తగ్గట్లు మన ఆటను కూడా మార్చుకోవాలని అనిపించింది. ఈ విషయాన్ని రోహిత్‌కు చెప్పగానే అతను ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు.
దూకుడుగా ఆడాలని ఇతరులకు చెప్పకుండా.. కెప్టెన్‌గా తానే చేసి ఇతర ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. వ్యక్తిగత గణంకాలను పట్టించుకోకుండా దూకుడుగా ఆడి జట్టు మొత్తం అతన్ని అనుసరించేలా చేశాడు. రోహిత్ సారథ్య బాధ్యతలు స్వీకరించిన తీరు అద్భుతం. అయితే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతను మారిపోలేదు. నాయకుడిలో ఉండాల్సిన అరుదైన లక్షణం అది. అతని సెల్ఫెలెస్ కెప్టెన్సీ వల్లే ఈ రోజు భారత్ ప్రమాదకరంగా కనిపిస్తోంది.'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.