PAK vs NZ: రచిన్ రవీంద్ర తలకు తీవ్ర గాయం.. ఆసుపత్రికి తరలింపు! (వీడియో)
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టే ప్రయత్నంలో రచిన్ రవీంద్ర నుదిటికి బంతికి బలంగా తాకింది. ఆ బంతి ధాటికి రక్త స్రావం కావడంతో ఫిజియోలు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ గాయం వీడియో చాలా భయానకంగా ఉండటంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రచిన్ రవీంద్ర త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?
పాకిస్థాన్ ఇన్నింగ్స్ సందర్భంగా మైఖేల్ బ్రేస్‌వేసిన 37వ ఓవర్‌లో ఈఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని పాకిస్థాన్ బ్యాటర్ కుష్దిల్ షా.. స్క్వేర్ లెగ్ దిశగా.. స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్రకు బంతి ఈజీ క్యాచ్‌గా వెళ్లింది. కానీ ఈ బంతిని అంచనా వేయడంలో విఫలమైన రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టుకోకపోవడంతో బంతి నేరుగా అతని నుదిటికి తాకింది. ఆ గాయం దాటికి రచిన్ రవీంద్ర నేలకూలగా.. తీవ్ర రక్త స్రావం జరిగింది.
ఫిజియోలు పరుగెత్తుకొచ్చి కర్చీఫ్ సాయంతో రక్త స్రావాన్ని ఆపే ప్రయత్నం చేశారు. బయటకు తీసుకెళ్లేందుకు గ్రౌండ్స్‌మెన్ స్ట్రెచర్ తెచ్చినా.. రచిన్ రవీంద్ర నడుచుకుంటూ మైదానం వీడాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రచిన్ రవీంద్ర గాయాన్ని చూసి అభిమానులు భయాందోళనకు గురయ్యారు. కాసేపు మైదానం మొత్తం నిశబ్దంగా ఉండిపోయింది. ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఘటనను గుర్తు చేసిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు రచిన్ రవీంద్ర గాయపడటం న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బే.
A tough moment on the field for Rachin Ravindra as an attempted catch turned into an unfortunate injury. 🤕
— FanCode (@FanCode) February 8, 2025
Get well soon, Rachin! pic.twitter.com/34dB108tpF
పాకిస్థాన్ ఘోర పరాజయం
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 78 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 330 పరుగులు చేసింది. గ్లేన్ ఫిలిప్స్(74 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. డారిల్ మిచెల్(84 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81), కేన్ విలియమ్సన్(89 బంతుల్లో 7 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(3/88) మూడు వికెట్లు తీగాయ.. అబ్రర్ అహ్మద్(2/41) రెండు వికెట్లు పడగొట్టాడు. హ్యారీస్ రౌఫ్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం పాకిస్థాన్ 47.5 ఓవర్లలో 252 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఫకార్ జమాన్(69 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84), సల్మాన్ అఘా(51 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 40) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్(3), బాబర్ ఆజామ్(10) తీవ్రంగా నిరాశపరిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లు తీయగా.. మైకేల్ బ్రేస్‌వెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. గ్లేన్ ఫిలిప్స్‌కు ఓ వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications