అయ్య బాబోయ్.. పంత్ హార్ట్‌ఎటాక్ తెప్పిస్తుంటాడు: ఫీల్డింగ్ కోచ్

చెన్నై: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఏదైనా చేయగలడని ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ అంటున్నాడు. పంత్ తన బ్యాటింగ్‌తో హార్ట్‌ఎటాక్ తెప్పించగలడని, అలాగే ఊపిరి బిగపట్టేలా చేయగలడన్నారు. పంత్ హిట్టింగ్ ఒక్కోసారి ఆశ్చర్యకరరీతిలో సాగుతుంటుందని, మైదానంలో భారీ షాట్లు ఆడేందుకు ఏమాత్రం వెనుకాడని శ్రీధర్ చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడిన పంత్.. 274 పరుగులు చేసి సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిడ్నీలో 97 పరుగులకు ఔటై త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న పంత్.. గబ్బా టెస్టులో (89 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో హీరో అయ్యాడు.

పంత్ హార్ట్‌ఎటాక్ తెప్పించగలడు:
భారత్-ఇంగ్లండ్ మధ్య ఈ నెల 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ ఎలాంటి ఆటగాడనే విషయంపై టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఓ స్పష్టతనిచ్చారు. పంత్ ఓ ఆల్‌రౌండ్ ప్యాకేజీ లాంటోడని కొనియాడారు. క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో శ్రీధర్ మాట్లాడుతూ... 'పంత్ హార్ట్‌ఎటాక్ తెప్పించగలడు, గుండె బద్దలయ్యేలా చేయగలడు. అదే సమయంలో ఊపిరి బిగపట్టేలా చేయగలడు. అందర్నీ ఎలా ఆశ్చర్యపరుస్తాడో అలాగే నిరాశపరుస్తాడు. రెండింటినీ సమాన రీతిలో చూపించే శక్తి సామర్థ్యాలున్న ఆటగాడు' అని అన్నారు.

ఆశించేది ఒకటైతే.. మరోలా చేస్తుంటాడు:
'క్రికెట్ ప్రపంచంలో ఉన్న విధ్వంసకర ఆటగాళ్లలో రిషభ్ పంత్ కూడా ఒకడు. అతనిలో ఏమాత్రం బెరుకు కనిపించదు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ కావడంతో.. మిడిలార్డర్‌లోనూ జట్టుకి వేరియేషన్ లభిస్తుంది. కానీ అతని నుంచి మనం ఆశించేది ఒకటైతే.. మరోలా చేస్తుంటాడు. కొన్నిసార్లు అతని ఆట కారణంగా మన హృదయం ముక్కలవుతుంది' అని ఫీల్డింగ్ కోచ్ చెప్పారు. ఆసీస్ పర్యటనలో తన కీపింగ్ నైపుణ్యాలు మెరుగుపర్చుకోడానికి పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయాన్ని వదులుకున్నట్లు తెలిపారు. దాంతో కీపింగ్‌లోనూ మెరగవ్వడానికి కష్టపడుతున్నట్లు వివరించారు.

చివరి వరకూ క్రీజులో నిలిచి:
సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌లో 407 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా.. రిషభ్ పంత్ (97: 118 బంతుల్లో 12x4, 3x6) దూకుడుగా ఆడటంతో ఒకానొక దశలో విజయం సాధించేలా కనిపించింది. అయితే జట్టు స్కోరు 250 వద్ద పంత్ ఔటవగా.. అనంతరం సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (39 నాటౌట్; 128 బంతుల్లో 7×4), హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి (23 నాటౌట్; 161 బంతుల్లో 4×4) మ్యాచ్‌ని డ్రాగా ముగించారు. ఇక గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో 328 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టుని.. చివరి వరకూ క్రీజులో నిలిచిన పంత్ (89 నాటౌట్: 138 బంతుల్లో 9x4, 1x6) మరో 19 బంతుల ఆట మిగిలి ఉండగానే టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

శుక్రవారం తొలి టెస్ట్:
రిషభ్ పంత్ ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. చెన్నైలో శుక్రవారం తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. బయోబబుల్‌లో క్వారంటైన్ పూర్తి కావడం, కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఇరు జట్ల ఆటగాళ్లు సన్నాహాలకు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి భారత్, ఇంగ్లిష్ జట్ల ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌కు దిగనున్నారు. సుదీర్ఘ పర్యటనలో భారత్-ఇంగ్లండ్ జట్లు వరుసగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
జెర్సీ మార్చుకుంటూ.. బౌండరీ మిస్ చేసిన ఫీల్డర్! (వీడియో)