ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, రవిచంద్రన్ అశ్విన్ మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌తో హిందీ కామెంటేటర్‌గా రవిచంద్రన్ అశ్విన్ అరంగేట్రం చేశాడు. కొత్తగా హిందీ కామెంట్రీ ప్యానెల్‌లోకి వచ్చిన అశ్విన్‌కు సీనియర్‌గా సెహ్వాగ్ కొన్ని సూచనలు చేశాడు.
'ఈ రోజు మనం లాజిక్, ఆలోచనతో కాకుండా మనసుతో మాట్లాడుదాం.'అని సెహ్వాగ్ అన్నాడు. వెంటనే అశ్విన్ స్పందిస్తూ.. 'మా తల్లిదండ్రులు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని, ఆలోచించకుండా ఏదీ అనకూడదని నేర్పించారు. మీరు మాత్రం దానికి విరుద్దంగా చెబుతున్నారు.'అని అశ్విన్ అడిగాడు.

దానికి సెహ్వాగ్ తనదైన శైలిలో బదులిచ్చి నవ్వులు పూయించాడు. అశ్విన్‌కు యూట్యూబ్ ఛానెల్ ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అదిరిపోయే సమాధానమిచ్చాడు. 'కొందరు వ్యక్తులు కావాలనే ఆలోచించి మాట్లాడుతారు. వారు ఏమనుకుంటారంటే.. 'ఈ ప్లేయర్‌కు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు.. నేను గనుక అతని గురించి నెగటివ్‌గా మాట్లాడితే.. నా ఫాలోవర్లు తగ్గిపోతారు. అదే పాజిటివ్‌గా మాట్లాడితే.. నా ఫాలోవర్లు పెరుగుతారు' అని భావిస్తారు.'అని సెహ్వాగ్ చెప్పాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ సమష్టి ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(80) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఆర్‌సీబీ 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. దేవదత్ పడిక్కల్(26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61), విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీలతో విజయంలో కీలక పాత్ర పోషించారు.