అశ్విన్ నోట పెద్దల మాట.. టీ20 ప్రపంచకప్ ఎంపికపై భావోద్వేగం!

లండన్: నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అవకాశం దక్కడంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భావోద్వేగానికి గురయ్యాడు. ట్విటర్ వేదికగా మోటివేషనల్ కోట్ షేర్ చేశాడు. 15 మంది సభ్యులతో భారత సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించిన భారత టీ20 ప్రపంచకప్ జట్టులో అశ్విన్‌కు అవకాశం లభించింది. రవిచంద్రన్ అశ్విన్ 2017 జూలైలో భారత్ తరఫున వెస్టిండీస్‌తో తన చివరి టీ20 మ్యాచ్, అదే సిరీస్‌లో చివరిసారిగా వన్డే ఆడాడు.
నాలుగేళ్లుగాపూర్తిగా టెస్టులకు
నాలుగేళ్లుగా అతను పూర్తిగా టెస్టులకు పరిమితమయ్యాడు. అయితే ఐపీఎల్‌లో అశ్విన్ నిలకడైన ప్రదర్శన సెలక్టర్లు టీ20ల విషయంలో పునరాలోచించేలా చేసింది. 2020 ఐపీఎల్‌లో 7.66 ఎకానమీతో 13 వికెట్లు తీసి ఢిల్లీ తొలిసారి ఫైనల్‌కు చేరడంలో అశ్విన్ కూడా కీలకపాత్ర పోషించాడు. నిజానికి చెన్నైకే చెందిన వాషింగ్టన్ సుందర్ ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. అయితే గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో అశ్విన్ కు అవకాశం దక్కింది.

నమ్మినవాడే..
దీనిపై అశ్విన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. సంతోషం, కృతజ్ఞత అనే రెండు పదాలే తనేంటో నిర్వచిస్తాయని పేర్కొన్నాడు. నాలుగేళ్ల ఎదురు చూపులు ఫలిస్తూ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికైన తర్వాత అతడు ఇలా ట్వీట్ చేశాడు. 'ప్రతి సొరంగం చివరన వెలుతురు ఉంటుంది. అయితే, వెలుతురు చూడగలమని నమ్మిన వాళ్లే దాన్ని చూసేందుకు బతికుంటారు' అని రాసిన చిత్రాన్ని అశ్విన్ ట్వీట్ చేశాడు. 'ఈ మాటలను గోడపై అంటించడానికి ముందే కొన్ని లక్షల సార్లు నా డైరీలో రాశాను! మనం చదివే మంచి మాటలను అన్వయించుకొని, జీవితంలో ఆచరిస్తే అవి మనకు మరింత ప్రేరణ, బలాన్ని ఇస్తాయి' అని చెప్పుకొచ్చాడు.

వన్డేల్లో మంచి రికార్డున్నా..
2017, జులై 9న యాష్ చివరిగా వెస్టిండీస్‌పై టీ20 ఆడాడు. అదే జట్టుపై జూన్ 30న చివరి వన్డే ఆడాడు. 111 వన్డేలాడిన అతడు 32.91 సగటుతో 150 వికెట్లు తీశాడు. 46 టీ20ల్లో 22.94 సగటు, 6.97 ఎకానమీతో 52 వికెట్లు పడగొట్టాడు. ఇక 79 టెస్టులాడి 24.56 సగటు, 2.80 ఎకానమీతో 413 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ గాయపడటం, దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో యాష్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే.

అశ్విన్ అవసరం ఉండటంతోనే..
ఐపీఎల్‌లో రాణించడంతో పాటు అపార అనుభవం కలిగి ఉండటంతోనే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకున్నామని భారత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తెలిపాడు. ''అశ్విన్ జట్టుకు ఆస్తి. ఐపీఎల్‌లో రాణించాడు. జట్టుకు అతడిలాంటి అనుభవజ్ఞుడు అవసరం. వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో మాకు ఆఫ్‌స్పిన్నర్ అవసరమయ్యాడు. జట్టులో అశ్విన్ ఒక్కడే ఆఫ్‌స్పిన్నర్'' అని అన్నాడు. హార్దిక్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని చెప్పాడు. బౌలింగ్‌లో వేగం ఉండడం వల్లే చాహల్‌ను కాదని రాహుల్ చాహర్‌ను ఎంచుకున్నామని చేతన్ శర్మ తెలిపాడు. జడేజాకు బ్యాకప్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ జట్టులో స్థానం సంపాదించాడు. శ్రేయస్, శార్దూల్, దీపక్ చాహర్ స్టాండ్‌బైలుగా ఎంపికయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications