న్యూఢిల్లీ: టీమిండియా టాప్-7 బ్యాటర్లలో ముగ్గురు లెఫ్టాండర్స్‌ను ఆడించాలని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన సూచనలను వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుబట్టాడు. ఇది ఎలా సాధ్యమవుతోందో చెప్పాలని రవి శాస్త్రిని ప్రశ్నించాడు. వినడానికి ఈ సలహా బాగానే ఉన్నా.. ఆచరణకు సాధ్యం కాదని స్పష్టం చేశాడు.
ఇటీవల స్టార్ స్పోర్ట్స్ షోలో టీమిండియా కాంబినేషన్ గురించి చర్చించిన రవి శాస్త్రి టాప్-7 బ్యాటర్లలో ముగ్గురు లెఫ్టాండర్స్ ఉండాలన్నాడు. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రవీంద్ర జడేజాలను ఆడిస్తే ఇది సాధ్యమవుతుందని చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యలపై అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది అర్థం పర్థం లేని డిమాండ్ అని కొట్టిపారేసాడు.

'రవి శాస్త్రి ఓ కొత్త వాదనను తీసుకొచ్చాడు. టాప్-7 బ్యాటర్లలో కచ్చితంగా ముగ్గురు లెఫ్టాండర్స్ ఉండాలని చెబుతున్నాడు. ప్రస్తుత టీమ్‌లో ముగ్గురు లెఫ్టాండర్స్‌ను ఎక్కడ ఆడిస్తాడు? అది కూడా టాప్-7లో..? జట్టులో హార్దిక్, జడేజా కచ్చితంగా ఉంటారు. దాంతో ఒక లెఫ్టాండర్ ఉన్నట్లే. టాప్-3 బ్యాటర్లలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ ఆడటం ఖాయం.
ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా లెఫ్టాండర్ లేరు. కేఎల్ రాహుల్ ఫిట్ అయితే అతనే వికెట్ కీపర్‌గా కొనసాగుతాడు. శ్రేయస్ అయ్యర్ ఫిట్ అయినా అతనే నాలుగో స్థానంలో ఆడుతాడు. లెఫ్టాండర్స్‌ను ఎక్కడ ఆడించాలి. అందుకు ఎవర్ని తప్పించాలి?'అని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ప్రశ్నించాడు.
గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లను ఆసియాకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌కు దూరంగా ఉంచాలని రవి శాస్త్రి సూచించాడు. తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్‌లను జట్టులోకి తీసుకోవాలని, దాంతో జట్టుకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లభిస్తుందన్నాడు. ముఖ్యంగా టాప్-3 బ్యాటర్లలో ఒక లెఫ్టాండర్ ఉండటం కీలకమని చెప్పుకొచ్చాడు.
కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం అనుభవం పేరిట కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లనే కొనసాగించనుంది. ఆగస్టు 21న ఆసియాకప్ 2023 టోర్నీలో ఆడే భారత జట్టును ఎంపిక చేయనుంది.