స్పిన్ పిచ్‌లపై ఏడ్చే మాజీ క్రికెటర్లపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. తన సెటైరికల్ పోస్ట్‌తో మాజీ క్రికెటర్ల ద్వంద వైఖరిని ఎండగట్టాడు. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్.. తొలి మ్యాచ్‌లో ఒకే రోజు 19 వికెట్లు పడ్డాయి.
పెర్త్ వేదికగా శుక్రవారం ప్రారంభమై ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 172 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్(61 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. ఓలీ పోప్(58 బంతుల్లో 4 ఫోర్లతో 46), జెమీ స్మిత్(22 బంతుల్లో 6 ఫోర్లతో 33) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(7/58) ఏడు వికెట్లతో నిప్పులు చెరిగాడు. బ్రెండన్ డొగ్గెట్(2/27) రెండు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ఆరంభంలోనే చివరి వికెట్ కోల్పోయి 132 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్(5/23) ఐదు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ (3/45) మూడు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్(2/11)కు రెండు వికెట్లు దక్కాయి.
పూర్తిగా పేస్‌కు అనుకూలంగా ఉన్న వికెట్ తయారు చేయడంతో తొలి రోజే 19 వికెట్లు కుప్పకూలాయి. ఈ 19 వికెట్లను పేసర్లే పడగొట్టడం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రస్తావించిన అశ్విన్.. మాజీ క్రికెటర్ల ద్వంద వైఖరిని నిలదీస్తూ తనదైన శైలిలో చురకలంటించాడు. భారత్‌లో స్పిన్ పిచ్‌లు తయారు చేస్తే విమర్శలు గుప్పించే మాజీ ఆటగాళ్లు.. పేస్ పిచ్‌ల గురించి ఎందుకు మాట్లాడరని నిలదీసాడు.
'పెర్త్‌లో ఒక్క రోజే 19 వికెట్లు పడ్డాయి. కానీ ఇది టెస్ట్ క్రికెట్‌కు అద్భుతమైన రోజు. ఇదే రేపు గౌహతిలో రిపీట్ అయితే ఏం జరుగుతుందో? తెలుసా?'అనే క్యాప్షన్‌తో ద్వంద వైఖరిని నిలదీసే ఓ ఏమోజీ వీడియోను అశ్విన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
టెస్ట్ క్రికెట్‌లో హోమ్ టీమ్స్ తమకు అనుకూలంగా ఉండే పేస్ పిచ్‌లు తయారు చేసుకుంటే అభ్యంతరం తెలపని మాజీ క్రికెటర్లు.. భారత్‌లో స్పిన్ పిచ్‌లు తయారు చేస్తే మాత్రం గగ్గోలు పెడుతారనే విషయాన్ని అశ్విన్ తన పోస్ట్ ద్వారా తెలియజేశాడు. ఇటీవల కోల్‌కతా వేదికగా ముగిసిన తొలి టెస్ట్‌లో స్పిన్ పిచ్ తయారు చేసినందుకు మాజీ క్రికెటర్లంతా విమర్శలు గుప్పించారు. టెస్ట్ క్రికెట్‌ను చంపేస్తారా? అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ పెర్త్ వేదికగా జరుగుతున్న యాషెస్ టెస్ట్ గురించి మాత్రం ఎవరూ ఒక్క కామెంట్ చేయడం లేదు.