For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ బంతి నా ప్యాడ్‌కు తాకి ఉంటే నా కెరీర్ ముగిసిపోయేది: అశ్విన్

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఓటమి అంచున చేరిన భారత జట్టుకు విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్‌తో సంచలన విజయాన్నందించాడు. క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుతమైన మ్యాచ్‌గా ఇది నిలిచిపోయింది.

సంచలన బ్యాటింగ్‌తో విజయానికి కోహ్లీ బాటలు వేసినా.. రవిచంద్రన్ అశ్విన్ చాకచక్యంతోనే భారత విజయం లాంఛనమైంది. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తూ అనేక మలుపులు తిరిగిన ఈ మ్యాచ్.. క్రికెట్ అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును కోహ్లీ అసాధారణ బ్యాటింగ్‌తో విజయం ముంగిట నిలబెట్టాడు.

R Ashwin recalls historic win vs Pakistan in T20 WC, says finished my career

చివరి రెండు బంతులకు రెండు పరుగులు చేయాల్సిన సమయంలో దినేశ్ కార్తీక్ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి అశ్విన్ రాగా.. చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. నవాజ్‌ వేసిన బంతి వైడ్‌ అవుతుందని ముందుగానే గ్రహించిన అశ్విన్ ముందుకు జరిగి దానిని వదిలేశాడు. దాంతో చివరి బంతికి ఒక్క పరుగే అవసరమవ్వగా లాఫ్టెడ్‌ షాట్‌కు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు.

తాజాగా ఈ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్న అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడిన అశ్విన్.. పాకిస్థాన్‌పై సాధించిన ఆ థ్రిల్లింగ్ విజయాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా వెన్నులో వణుకు పుడుతుందని చెప్పుకొచ్చాడు.

వైడ్ బాల్ అనుకొని తాను వదిలేసిన బంతి ప్యాడ్లను తాకి ఉంటే కెరీర్ ముగిసిపోయేదని చెప్పుకొచ్చాడు. 'వాస్తవానికి నాకు ఈ క్లిష్ట పరిస్థితిని కల్పించిన దినేశ్ కార్తీక్‌ను తిట్టుకున్నా. క్రీజులోకి వెళ్తున్నప్పుడు.. ప్రేక్షకుల కేకలతో నాకు లభించిన గొప్ప అవకాశంగా భావించాను. ఇంతకుముందు ఎప్పుడూ నేను అలాంటి వాతావరణాన్ని, ప్రేక్షకుల మద్దతును చూడలేదు.

ఆ ఒక్క బాల్ ఆడేందుకు విరాట్ కోహ్లీ నాకు ఏడు ఆప్షన్లు చెప్పాడు. అన్ని షాట్లు ఆడే సామర్థ్యం ఉంటే నేను 8వ స్థానంలో ఎందుకు బ్యాటింగ్ చేస్తా? అని నాలో నేను అనుకున్నా. కోహ్లీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ కోహ్లీ కళ్లలో నాకు ఏదో పవర్ కనిపించింది. ఇతర గ్రహం నుంచి వచ్చినవాడిలా కనిపించాడు. నవాజ్ వైడ్ బాల్ వేయగానే ఈ మ్యాచ్ గెలుస్తామనే నమ్మకం కలిగింది.

నా చేతుల్లో ఈ విజయం రాసిపెట్టుందని భావించాను. ప్రతీ రాత్రి పడుకునే ముందు ఈ మ్యాచ్ గురించి తలుచుకుంటూ... అసలేం జరిగిందని వీడియో చూస్తాను. ఒకవేళ అది వైడ్ బాల్ కాకుంటే.. నా ప్యాడ్‌కు వచ్చి తాకుంటే నా పరిస్థితి ఏంటని తలుచుకుంటేనే వెన్నులో భయం పడుతుంది. నిజాయితీగా చెప్పాలంటే అది వైడ్ బాల్ కాకుంటే నా కెరీర్ ముగిసిపోయేది. విరాట్ కోహ్లీ ఆడిన ఆ ఇన్నింగ్స్ మాత్రం అసాధారణమైనది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, June 29, 2023, 14:35 [IST]
Other articles published on Jun 29, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+