R AShwin vs Southee Fight: మధ్యలోకి మోర్గాన్.. నువ్వేందిరా? అంటూ ఢిల్లీ స్పిన్నర్ ఫైర్!( వీడియో)

షార్జా: ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా ఆ జట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కేకేఆర్ పేసర్ టీమ్ సౌథీ మధ్య చిన్నపాటి వాగ్వాదం నెలకొంది. ఔటైన ఫ్రస్టేషన్‌లో ఉన్న అశ్విన్‌ను సౌథీ తన వ్యాఖ్యలతో రెచ్చగొట్టగా.. ఈ ఢిల్లీ సీనియర్ స్పిన్నర్ శివాలెత్తిపోయాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది.
ఇక వీరి మధ్యలోకి ఇయాన్ మోర్గాన్ జోక్యం చేసుకోవడంతో మరింత ఆగ్రహానికి గురైన అశ్విన్.. సహనం కోల్పోయాడు. మధ్యలో నువ్వేందిరా? అన్నట్లూ అతనిపైకి దూసుకెళ్లాడు. అయితే కేకేఆర్ వికెట్ కీపర్, తమిళనాడు ప్లేయర్ అయినటువంటి దినేశ్ కార్తీక్.. అశ్విన్‌ను అడ్డుకొని శాంతపరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
సౌథీ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సౌథీ వేసిన స్లోయర్ బాల్‌ను అశ్విన్ పుల్ షాట్ ఆడాడు. అయితే మిస్ టైమ్ అయిన బంతి బ్యాక్ వార్డ్ స్క్వేర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నితీశ్ రాణాకి చిక్కింది. అయితే 19వ ఓవర్ చివరి బంతికి అశ్విన్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా పరుగు తీశాడని, ఆ విషయాన్ని సౌథీ, మోర్గాన్ ప్రస్తావించడంతోనే ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. వెంకటేశ్ అయ్యర్ వేసిన ఆ ఓవర్ చివరి బంతిని రిషభ్ పంత్ పాయింట్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసాడు.
అయితే బంతిని అందుకున్న ఫీల్డర్ వికెట్ల వైపు విసరగా.. అది కాస్త పంత్ భుజాలకు తాకి దూరంగా వెళ్లింది. దాంతో ఢిల్లీ మరో రన్ తీసుకుంది. అయితే మాములుగా త్రో విసిరిన సమయంలో బ్యాట్స్‌మన్‌కు బంతి తాకినప్పుడు మరో పరుగు తీయరు. ఇక్కడ ఇదే వివాదానికి ఆజ్యం పోసింది. ఈ విషయాన్నే అశ్విన్ ఔటైన తర్వాత సౌథీ ప్రస్తావించగా.. అతను ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.
అశ్విన్ రివేంజ్..
మైదానంలో తనతో వాగ్వాదానికి దిగిన కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను అశ్విన్ సిల్వర్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ఫస్ట్ స్లిప్ పెట్టి రిషభ్ పంత్‌తో కలిసిన పన్నిన వ్యూహంలో మోర్గాన్ చిక్కుకోవడంతో అశ్విన్ ఆనందానికి హద్దేలేకుండా పోయింది. ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 3 వికెట్లతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో నాలుగో ప్లేస్‌కు దూసుకెళ్లిన కేకేఆర్.. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
చేలరేగిన బౌలర్లు..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్(34 బంతుల్లో 4 ఫోర్లతో 39), రిషభ్ పంత్(36 బంతుల్లో 3 ఫోర్లతో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్(2/18), వెంకటేశ్ అయ్యర్(2/29), లూకీ ఫెర్గూసన్(2/10) రెండేసి వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ తీశాడు. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్లుగా వెనుదిరిగారు. షార్జా అంటే సిక్సర్ల వర్షం కురుస్తుంది. అలాంటిది ఈ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు.

నరైన్ మెరుపులు..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.2 ఓవర్లలో 7 వికెట్లకు 130 పరుగులు చేసి 10 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. నితీశ్ రాణా(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్), శుభ్‌మన్ గిల్(33 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 30) రాణించారు. చివర్లో సునీల్ నరైన్(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 21) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/13) మూడు వికెట్లు తీయగా.. అన్రిచ్ నోర్జ్, రవిచంద్రన్ అశ్విన్, లలిత్ యాదవ్, కగిసో రబడా చెరొక వికెట్ దక్కించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications