టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్) లీగ్ నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకున్నారు. మహిళా అంపైర్ వెంకటేశన్ కృతిక నిర్ణయాన్ని తప్పుబడుతూ అశ్విన్ దరుసుగా ప్రవర్తించాడు. అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ వాగ్వాదానికి దిగడంతో పాటు అసహనంతో గట్టిగా అరుస్తూ.. తన బ్యాట్‌తో ప్యాడ్లను కొట్టుకున్నాడు. బౌండరీ లైన్ దగ్గరకు రాగానే తన చేతి గ్లోవ్స్‌ను గ్యాలరీలోకి విసిరికొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. అశ్విన్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. ఓ చిన్న లీగ్ మ్యాచ్ కోసం మహిళా అంపైర్‌తో అనుచితంగా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
దిండిగల్ డ్రాగన్స్, తిరుప్పూర్ తమిళియన్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రాగన్స్‌కు సారథ్యం వహిస్తున్న అశ్విన్ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. సాయి కిశోర్ వేసిన ఐదో ఓవర్ ఐదో బంతిని అశ్విన్ ప్యాడల్ స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో అశ్విన్ విఫలమవ్వడంతో ప్యాడ్‌ను తాకింది. బౌలర్ అప్పీల్ చేయగానే అంపైర కృతిక ఔటిచ్చింది. అయితే బంతి లెగ్ స్టంప్ బయట పిచ్ అయినట్లు రిప్లేలో స్పష్టమైంది. తొలి ఓవర్‌లోనే వైడ్స్ కోసం రెండు రివ్యూలు వృథా చేయడంతో అంపైర్‌ను సవాల్ చేసే అవకాశం అశ్విన్‌కు లేకపోయింది. దాంతో అతను అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.

ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన మ్యాచ్ రిఫరీ అశ్విన్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించాడు. టోర్నీ రూల్స్ ప్రకారం అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు 10 శాతం, గ్లోవ్స్‌ను విసిరేసినందుకు 20 శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకున్నాడు. తన తప్పిదాన్ని మ్యాచ్ రిఫరీ ముందు అశ్విన్ అంగీకరించాడు. యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాల్సిన అశ్విన్ హద్దులు ధాటి ప్రవర్తించ కూడదని నెటిజన్లు సూచిస్తున్నారు.