ఐపీఎల్ 2026 వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్‌ను వీడేందుకు ఆ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్ సిద్దమయ్యాడని వార్తలు వచ్చాయి. జట్టు నుంచి తనను రిలీజ్ చేయాలని సంజూనే కోరినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) నుంచి భారీ ఆఫర్ రావడంతోనే సంజూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ డీల్‌పై చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సంజూ శాంసన్‌ను సీఎస్‌కేకు ఇచ్చేందుకు అంగీకరించిన రాజస్థాన్ రాయల్స్.. అందుకు బదులుగా జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబేల్లో ఇద్దర్నీ ఇవ్వాలని షరతు పెట్టినట్లు సమాచారం. ఈ షరతును సీఎస్‌కే వ్యతిరేకించినట్లు కూడా తెలుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై మాట్లాడిన అశ్విన్.. సంజూ-సీఎస్‌కే ట్రేడ్ డీల్ వర్కౌట్ కాదని చెప్పాడు.

'సీఎస్‌కే-రాజస్థాన్ రాయల్స్ ట్రేడ్ డీల్ వర్కౌట్ కాదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఒకవేళ చెన్నైకి సంజూను ట్రేడింగ్ చేసి.. రాజస్థాన్ రాయల్స్ ఇతర జట్లతోనూ ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తే ఆశించిన ఆటగాళ్లు దక్కరు. ఉదాహరణకు రాజస్థాన్ రాయల్స్‌కు రవి బిష్ణోయ్‌లాంటి స్పిన్నర్ కావాలి. అప్పుడు లక్నోకు సంజూను ఇచ్చేసి బిష్ణోయ్‌ను తీసుకునేందుకు ట్రేడ్ డీల్ చేసుకోవాలి. లక్నో జట్టు సంజూను తీసుకుంటే ఆ జట్టు పర్స్ వాల్యూపై ప్రభావం పడుతుంది.
చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కూడా ఇదే. రవీంద్ర జడేజా, శివమ్ దూబేలను అస్సలు వదులుకోదు. వారు లేకుండా ట్రేడ్ డీల్ చేసుకోవడం వల్ల రాజస్థాన్ రాయల్స్‌కు పెద్ద ప్రయోజనం ఉండదు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సంజూ శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 18 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. మరోవైపు జడేజాను రూ. 18 కోట్లకు, శివమ్ దూబేను రూ. 12 కోట్లకు సీఎస్‌కే అంటిపెట్టుకుంది.
సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను రిప్లేస్‌మెంట్‌గా తీసుకోనేందుకు సీఎస్‌కే భారీ మొత్తంలో ఖర్చు చేసిందని అశ్విన్ తెలిపాడు. అతని బేస్ ప్రైజ్ కంటే ఎక్కువే చెల్లించి తీసుకుందన్నాడు. 'డెవాల్డ్ బ్రెవిస్‌ను రిప్లేస్‌మెంట్‌గా తీసుకోనేందుకు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ, ధర చూసి వదిలేసాయి. సీఎస్‌కే మాత్రం భారీ మొత్తం వెచ్చించి తీసుకుంది. అతని బేస్ ప్రైజ్ కంటే ఎక్కువగా చెల్లించింది.
ఇందుకోసం ప్లేయర్ ఏజెంట్స్‌తో చర్చలు జరిపింది. అప్‌కమింగ్ ఐపీఎల్ వేలంలో చెన్నై రూ. 30 కోట్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. గుర్జప్‌నీత్ సింగ్ స్థానంలో బ్రెవిస్‌ను సీఎస్‌కే రిప్లేస్ చేసుకుంది. బ్రెవిస్ బేస్ ప్రైజ్ రూ. 75 లక్షలు కాగా.. అంతకు రెండు మూడు రెట్లు ఎక్కువ చెల్లించినట్లు సమాచారం. అశ్విన్ తాజా వ్యాఖ్యలతో డెవాల్డ్ బ్రెవిస్‌ను చెన్నై అక్రమంగా తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.