టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో కొత్త బంతిని సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు కాకుండా అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్‌కు ఇవ్వడాన్ని సమర్థించాడు. గిల్ అలా ఎందుకు చేశాడో తాను అర్థం చేసుకోగలనని వెల్లడించాడు. శుభ్‌మన్ గిల్ చేసిన ఈ తప్పిదంతోనే టీమిండియాకు తీరని నష్టం జరిగిందని పలువురు క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. వాషింగ్టన్ సుందర్‌తో ఒక్క ఓవర్ వేయకపోవడాన్ని కూడా తప్పుబట్టారు. తొలి ఓవర్‌లోనే అన్షుల్ కంబోజ్ ధారళంగా పరుగులిచ్చాడు. తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు ఒత్తిడితో అన్షుల్ లైన్ మిస్సవ్వగా.. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మూడు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత మరింత స్వేచ్ఛగా ఆడి బాజ్ బాల్ గేమ్ చూపించాడు.
తాజాగా ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. శుభ్‌మన్ గిల్‌ను వెనకేసుకొచ్చాడు. 'శుభ్‌మన్ గిల్ కొత్త బంతిని అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్‌కు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే గిల్ ఇలా ఎందుకు చేశాడో నేను అర్థం చేసుకోగలను. అన్షుల్‌కు మంచి మణికట్టు పొజిషన్ ఉంది. అతను బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. మరోవైపు సిరాజ్.. పాత బంతితో కూడా రాణించగలడు. దాంతోనే అన్షుల్‌కు గిల్ కొత్త బంతి అందించాడు.

అరంగేట్ర మ్యాచ్‌లోనే జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి బాజ్ బాల్‌కు వ్యతిరేకంగా అన్షుల్ కంబోజ్ మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఆశించడమే అత్యాశ. అతని మొదటి స్పెల్ నిరాశపర్చింది. కానీ తర్వాత అతను అద్భుతంగా పుంజుకున్నాడు. రేపు(మూడో రోజు ఆట) పరిస్థితులు అనుకూలిస్తే.. అతను మరిన్ని వికెట్లు తీసినా నేను ఆశ్చర్యపోను'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 46 ఓవర్లలో 2 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్(100 బంతుల్లో 13 ఫోర్లతో 94), జాక్ క్రాలీ (113 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 84) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. క్రీజులో ఓలిపోప్(16 బ్యాటింగ్)తో పాటు జోరూట్(0 బ్యాటింగ్) ఉన్నాడు. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ అన్షూల్ కంబోజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసారు.
అంతకుముందు 264/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(75 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరో వికెట్ తీసారు. ఇంగ్లండ్ ఇంకా 133 పరుగుల వెనుకంజలో ఉంది. మూడో రోజు తొలి సెషన్ ఆట మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది.