SA vs NZ: వన్డే ప్రపంచకప్ 2023లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ దుమ్మురేపుతున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో పుణే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో డికాక్ సెంచరీతో సత్తా చాటాడు. 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు చేశాడు. ఈ మెగా టోర్నీ అనంతరం వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటానని ఇప్పటికే ప్రకటించిన డికాక్.. కెరీర్ చివరి దశలో సెంచరీలతో చెలరేగుతున్నాడు.
శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది మెగా టోర్నీని ఘనంగా ప్రారంభించిన డికాక్(100).. అనంతరం ఆస్ట్రేలియాపై 109 మరో శతకాన్ని నమోదు చేశాడు. నెదర్లాండ్స్, ఇంగ్లండ్ జట్లతో అతను విఫలమవ్వగా.. బంగ్లాదేశ్‌తో 174 భారీ శతకాన్ని నమోదు చేశాడు. పాకిస్థాన్‌తో విఫలమైనా.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తాజా మ్యాచ్‌లో 114 పరుగులతో శతక్కొట్టాడు.

మెగా టోర్నీలో ఇప్పటి వరకు 7 ఇన్నింగ్స్‌లు ఆడిన డికాక్.. వరుసగా 100, 109, 20, 4, 174, 24, 114 పరుగులతో దుమ్మురేపాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ మెగా టోర్నీలో డికాక్ మరో సెంచరీ బాదితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును అందుకుంటాడు. వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు.
2019 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 5 సెంచరీలు నమోదు చేశాడు. తాజా ప్రపంచకప్‌లో ఇప్పటికే 4 శతకాలు బాదిన డికాక్.. కుమార సంగక్కర రికార్డును సమం చేశాడు. 2015 ప్రపంచకప్‌లో సంగక్కర 4 శతకాలు నమోదు చేశాడు. సెంచరీల మోత మోగిస్తున్న డికాక్‌కు ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
2015, 2019 ప్రపంచకప్‌ల్లో ఒక్క సెంచరీ కూడా చేయని డికాక్.. తాజా టోర్నీలో మాత్రం 4 సెంచరీలతో దుమ్ము రేపాడు. ఇక సౌతాఫ్రికా తరఫున వన్డే ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్‌లో 500 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా కూడా డికాక్ చరిత్రకెక్కాడు.
డికాక్ సెంచరీకి తోడుగా వాన్‌డెర్ డస్సెన్ సైతం శతక్కొట్టడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 200 పరుగులు జోడించారు. డికాక్‌ను సౌథీ పెవిలియన్ చేర్చగా.. డస్సెన్ చెలరేగుతున్నాడు. ఇప్పటికే 300 పరుగుల మార్క్‌ను ధాటిన సౌతాఫ్రికా భారీ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది.