ఈ ఏడాది(2025) నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల జాబితాను గూగుల్ ప్రకటించింది. క్రీడా జట్ల విభాగంలో ఐపీఎల్ నుంచి పంజాబ్ కింగ్స్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచిన ఆర్‌సీబీ కంటే.. పంజాబ్ కింగ్స్ గురించే నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేశారు. అత్యధిక టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ లిస్ట్‌లో వెనకబడ్డాయి. మొత్తం నాలుగు ఐపీఎల్ జట్లు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్ ఆర్‌సీబీకి బాగా కలిసొచ్చింది. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్‌సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. అయినా ఆ జట్టు టాప్ సెర్చ్‌లో లేదు. విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ వంటి బిగ్ స్టార్స్ ఉన్నప్పటికీ.. ఆర్‌సీబీ, సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ అత్యధికంగా సెర్చ్ చేసిన జట్లలో టాప్-3లో లేకపోవడం అభిమానులు ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ మూడు స్టార్ టీమ్స్‌ను వెనక్కునెట్టి పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో నిలిచాయి. అత్యధికంగా సెర్చ్ చేసిన ఐపీఎల్ టీమ్స్‌లో ఈ రెండు జట్లు టాప్‌లో నిలిచాయి. ఐపీఎల్ అరంగేట్రం నుంచి ఉన్న పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్క టైటిల్ గెలవలేదు. కానీ ఈసారి అద్భుత ప్రదర్శనతో నెటిజన్లు దృష్టిని ఆకర్షించింది. అత్యధికంగా సెర్చ్ చేసిన క్రీడా టీమ్స్ జాబితాలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు, ఐదో స్థానంలో నిలిచాయి.
2008 నుంచి ఆడుతున్నా ఒక్క ట్రోఫీ కూడా గెలవని ఈ జట్లు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ 6, 7 స్థానంలో నిలవగా.. ఫుట్‌బాల్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మైన్ టీమ్ టాప్‌లో నిలవగా.. పోర్చుగీస్ ఫుట్‌బాల్ టీమ్ ఎస్‌ఎల్ బెంఫికా రెండో స్థానంలో నిలిచింది.