
చండీఘడ్ : టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా బంధువులపై దోపిడీ దొంగలు చేసిన దాడిపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని పంజాబ్ పోలీస్ యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. కేసును వీలైనంత త్వరగా చేధించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇక పంజాబ్‌లో తమ బంధువులపై జరిగిన దాడి అత్యంత హేయమైనదని, దుండగులు తన మామను అతికిరాతకంగా చంపారని సురేశ్ రైనా మంగళవారం ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తన కజిన్ ప్రాణాలు కోల్పోగా .. మేనత్త పరిస్థితి విషమంగా ఉందని, దుండగులను విడిచిపెట్టవద్దని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌కు ట్యాగ్ చేస్తూ రైనా ట్వీట్ చేశాడు.
రైనా మామ (మేనత్త భర్త) అశోక్ కుమార్ దోపిడీ దొంగల దాడిలో ప్రాణాలు కోల్పోగా నలుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారన్నారు . పంజాబ్ పఠాన్‌కోఠ్ జిల్లాలో ప్రభుత్వ కాంట్రాక్టర్ అయిన అశోక్ కుమార్(58) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నారు. ఈ నెల 19న రాత్రి వీరు డాబాపై నిద్రిస్తుండగా...గుర్తు తెలియని దుండగులు వీరి ఇంట్లోకి ప్రవేశించి దోపిడికి ప్రయత్నించారు.
అయితే వారిపై అశోక్‌తో పాటు కుటుంబ సభ్యులు తిరగబడటంతో బలమైన ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. కొంత నగదు, బంగారం దోచుకెళ్లారు. దోపిడీ దొంగల దాడిలో అశోక్ కుమార్ తలకు తీవ్ర గాయాలుకాగా...అదే రాత్రి కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. అశోక్ కుమార్ తల్లి సత్యదేవి, భార్య ఆశాదేవి, కుమారులు అపిన్, కౌశల్ కూడా గాయపడ్డారు. సత్యదేవి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా..మిగిలిన ముగ్గురిలో ఒకరు సోమవారం రాత్రి ప్రాణాలు విడిచారు.
మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మరోవైపు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ ఘటనకు పాల్పడింది 'కాలే కచ్చే గ్యాంగ్' అని తెలినప్పటికీ సాధ్యమైన అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ దింకర్ గుప్తా తెలిపారు. ఇక ఈ కారణంతోనే సురేశ్ రైనా ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.