టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి జాక్‌పాట్ లభించింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఆంధ్ర కుర్రాడు.. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతోనే జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు గాయం కారణంగా చివరి నిమిషంలో జట్టు నుంచి తప్పుకున్నాడు.
టీమిండియాకు ఆడే అవకాశాన్ని చేజార్చుకున్న నితీష్ కుమార్ రెడ్డికి అదిరిపోయే ఆఫర్ లభించింది. ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ కంపెనీ 'పుమా' నితీష్ కుమార్ రెడ్డిని తమ ప్రచారాకర్తగా నియమించుకుంది. ఐపీఎల్ 2024లో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డితో పాటు రియాన్ పరాగ్‌లను Z తరం బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది.

ఇప్పటికే విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ పుమా ఉత్పత్పులకు ప్రచారం కల్పిస్తుండగా.. తాజాగా రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డిలు వారి సరసన చేరారు. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్‌లకు భారీ మొత్తంలో పుమా కంపెనీ డబ్బులు ఇవ్వనుంది. కుర్రాళ్ల కెరీర్‌కు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడనుంది.
గువహతికి చెందిన 22 ఏళ్ల రియాన్ పరాగ్.. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అత్యధిక పరుగులు చేసిన అనామక ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. భారత అండర్ 19 జట్టు తరఫున కూడా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 21 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి.. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ అందుకున్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 33.67 సగటుతో 303 పరుగులు చేశాడు. 142.92 స్ట్రైక్‌రేట్‌తో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కీలక బ్యాటర్లంతా విఫలమైన వేళ నితీష్ కుమార్ రెడ్డి(76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసాడు.
పుమా ప్రచారకర్తల జాబితాలో ఇప్పటికే విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, కరీనా కపూర్, హర్మన్‌ప్రీత్ కౌర్, మేరీ కోమ్, అవని లఖేరా, Z జనరేషన్ సెన్సేషన్ ఇబ్రహీమ్ అలీ ఖాన్, శనన్య కపూర్‌లు ఉండగా.. తాజాగా నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్ చేరారు. వీళ్లు పుమాకు సంబంధించిన స్పోర్ట్స్ ఉత్పత్పులను ప్రచారం చేయనున్నారు.
పుమా ప్రచారకర్తగా ఎంపికవ్వడంపై నితీష్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు. 'పుమాతో ఒప్పందాన్ని గొప్ప మైలురాయిగా భావిస్తున్నాను. మైదానం లోపలా, బయటా స్పోర్ట్స్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ఆసక్తిగా ఉన్నాను. అదే అభిరుచి, నిబద్దదతో అథ్లెట్ల కలలను సాకారం చేసేందుకు పుమాతో కలిసి కృషి చేస్తాం'అని చెప్పుకొచ్చాడు.