పాకిస్థాన్ వెటరన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ మూడో భార్య సనా జావేద్‌ను అభిమానులు ఆటపట్టించారు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2024 సీజన్‌లో షోయబ్ మాలిక్‌కు మద్దతు తెలిపేందుకు మైదానానికి వచ్చిన ఆమెను ఫ్యాన్స్.. సానియా మీర్జా అంటూ టీజ్ చేశారు. గట్టిగా అరుస్తూ ఇబ్బంది పెట్టారు. దాంతో తీవ్ర అసంతృప్తికి లోనైనా ఆమె అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పీఎస్‌ఎల్‌లో షోయబ్ మాలిక్ కరాచీ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ముల్తాన్ సుల్తాన్స్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 55 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 185 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్(41 బంతుల్లో 4 ఫోర్లు సిక్స్‌తో 52), రీజా హెండ్రీక్స్(79 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. అనంతరం కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులే చేసి ఓటమిపాలైంది. షోయబ్ మాలిక్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు.
సానియా మీర్జాతో 14 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకున్న షోయబ్ మాలిక్.. పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్‌ను చేసుకున్నాడు. ఇది షోయబ్ మాలిక్‌కు మూడో పెళ్లి. తన తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల అనంతరం 2010లో సానియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికి 2010లో ఓ బాబు కూడా పుట్టాడు.
మూడో పెళ్లిపై స్పందిస్తూ.. మనసుకు నచ్చిన పని చేయాలని, జనాలు ఏమనుకుంటున్నారో ఆలోచించకూడదని మాలిక్ తెలిపాడు. ఇక సానియాతో వివాహ బంధం కొనసాగిస్తూనే సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన సానియా మీర్జా.. షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇచ్చేసి భారత్‌కు వచ్చేసింది.
షోయబ్ మాలిక్ మూడో పెళ్లి వ్యవహారం వారి కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం లేదని తెలుస్తోంది. మాలిక్ సోదరి అతని తీరును తప్పుబట్టింది. షోయబ్ మాలిక్ అభిమానులు కూడా సానియాను దూరం చేసుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. తమ అభిమాన క్రికెటర్‌పైనే విమర్శలు గుప్పిస్తున్నారు.