
హైదరాబాద్: ప్రస్తుత భారత జట్టులో తన అత్యుత్తమ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మనేనని యువ క్రికెటర్, అండర్-19 భారత జట్టు కెప్టెన్ ప్రియమ్ గార్గ్ తెలిపాడు. బుధవారం హలో యాప్ లైవ్‌లో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయిన ఈ యువ క్రికెటర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రేక్షకులు లేకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
ఈ సందర్భంగా ఓ అభిమాని ప్రియమ్ గార్గ్‌ను ప్రస్తుత భారత జట్టులో బెస్ట్ బ్యాట్స్‌మన్, బౌలర్ ఎవరని అడగ్గా.. ఈ అండర్-19 కెప్టెన్ రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాల పేర్లను చెప్పాడు. బెస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అని తెలియజేశాడు. తమ రాష్ట్రానికి చెందినవాడని చెప్పడం లేదని అతని బౌలింగ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు.
అండర్-19 బెస్ట్ కెప్టెన్ మహమ్మద్ కైఫ్ అని, స్టెడ్జింగ్ ఆటలో భాగమని తెలిపాడు. స్లెడ్జింగ్ ద్వారా ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయవచ్చని, శృతిమించని వరకు చేయవచ్చన్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో తాను కూడా స్లెడ్జింగ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. తనపై ఎవరన్నా మాటల దాడి చేస్తే అస్సలు పట్టించుకోనని, తన ఆట తాను ఆడుకుంటానన్నాడు.

8-12సంవత్సరాల మధ్య క్రికెట్లో అడుగుపెట్టడం మంచిదని సలహా ఇచ్చాడు. ఫైనల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లతో గొడవకు దిగిన తన సహచర ఆటగాడు రవి బిష్ణోయ్ ఎంతో కష్టపడతాడని, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఏం చేసిన వంద శాతం న్యాయం చేస్తాడని ప్రియమ్ గార్గ్ కొనియాడాడు. రాత్రికి రాత్రే ఎవరూ పెద్ద స్టార్ అయిపోరని, దాని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంటుందన్నాడు. క్రీడాకారులకు ఫిట్ నెస్ ఎంతో ముఖ్యమని, అలాగే ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్ తో ఆరోగ్యంగా ఉండాలని సూచించాడు.
అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో ఆద్యాంతం అదరగొట్టిన ప్రియమ్ గార్గ్ నేతృత్వంలోని యువభారత్.. ఫైనల్లో మాత్రం బంగ్లాదేశ్ చేతిలో ఓడింది. ఇక ఐపీఎల్ 2020 సీజన్ వేలంలో ప్రియమ్ గార్గ్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. కోటి 90 లక్షలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో అతను వేలంలో రాగా.. ఈ యువ ప్లేయర్ కోసం ప్రాంచైజీలు పోటీపడ్డాయి.