టీమిండియా వెటరన్ బ్యాటర్ పృథ్వీ షా ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. గత కొంతకాలంగా నిలకడలేమి ఆటతో పాటు ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న ఈ మాజీ ముంబై ఆటగాడు.. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన బుచ్చిబాబు టోర్నీలో సెంచరీతో చెలరేగాడు. ఈ దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభానికి ముందు ముంబై నుంచి మహారాష్ట్ర జట్టుకు మారిన పృథ్వీ షా..ఆ జట్టు తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే శతక్కొట్టాడు. చత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే తరహాలో దూకుడుగా ఆడిన పృథ్వీ షా తన క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.
మిగతా టాపార్డర్ బ్యాటర్లంతా విఫలమైన వేళ పృథ్వీ క్రీజులో నిలదొక్కుకున్నాడు. 51 ఓవర్లు పూర్తయ్యే సరికి మహారాష్ట్ర 5 వికెట్లకు 164 పరుగులు చేస్తే.. పృథ్వీ షానే 110 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. మహారాష్ట్ర బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్(1), సచిన్ ధాస్(10), సిద్దేష్ వీర్(4), అంకీత్ బావనే(0) తీవ్రంగా నిరాశపర్చారు. సిద్దార్థ్ మాత్రే(21) కాసేపు పృథ్వీ షాతో అండగా నిలిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు పృథ్వీ తన దూకుడు కొనసాగించాడు.

బుచ్చిబాబు టోర్నీతో పాటు రంజీ ట్రోఫీలోనూ పృథ్వీ ఇదే జోరు కొనసాగిస్తే భారత జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడు. మహారాష్ట్ర జట్టు తరఫున తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదడంతో పృథ్వీ షా 2.O షురూ.. బౌలర్లకు దబిడి దిబిడే అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కరుణ్ నాయర్ సైతం దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు చత్తీస్‌ఘడ్ 89.3 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. సంజీత్ దేశాయ్(93) శతకం చేజార్చుకోగా.. అవ్‌నీష్ సింగ్(52) హాఫ్ సెంచరీతో రాణించాడు.