
షాకే ఓటు
'ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్లో పృథ్వీ షా పరుగుల వరద పారించాడు. భారీ సెంచరీలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో కూడా అదరగొట్టాడు. ఓపెనింగ్ భాగస్వాములుగా శిఖర్ ధావన్, పృథ్వీ షాకు మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్ టోర్నీలోనూ వారిద్దరు ఒకే జట్టు (ఢిల్లీ క్యాపిటల్స్) కు ఓపెనింగ్ చేస్తారు. అందుకే శ్రీలంకతో తొలి వన్డేలో మరొకరు ఓపెనింగ్ చేస్తారంటే ఆశ్చర్యమే. రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్ మరికాస్త ఓపిక పట్టాలి. వారికీ అవకాశం వస్తుంది' అని కొలంబోలోని బీసీసీఐకి చెందిన భారత వర్గాలు అంటున్నాయి.

గైక్వాడ్, పడిక్కల్‌లకు నిరాశే
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత యువ జట్టు లంకకు వెళ్లింది. దేశవాళీ, ఐపీఎల్ టోర్నీలో సత్తాచాటిన యువ ఆటగాళ్లు లంక పర్యటనలో ఉన్నారు. జట్టులో ఇప్పుడు ఐదుగురు ఓపెనర్లు ఉన్నారు. శిఖర్ ధావన్ తర్వాత పృథ్వీ షాకే ఓపెనర్‌గా అంతర్జాతీయ అనుభవం ఉంది.
పైగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మిగిలిన ముగ్గురు రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, నితీశ్ రాణా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున పడిక్కల్, చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున రుతురాజ్ ఓపెనర్లుగా అదరగొట్టారు. నితీశ్ ఓపెనింగే కాకుండా వన్‌డౌన్‌లో ఆడగలడు. అయితే అతడికి అవకాశం రాకపోవచ్చు.
Sri Lanka vs India: కెప్టెన్‌గా నా లక్ష్యం అదే: గబ్బర్

మూడో స్థానంలో సూర్య
సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్‌లకు చోటు ఖాయంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్ రేసులో ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఉన్నారు. సంజుకు సరైన అవకాశాలు ఇవ్వలేదన్న అపవాదు బీసీసీఐపై ఉంది కాబట్టి.. అతడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఉపఖండ పిచ్‌లు కాబట్టి కచ్చితంగా ఇద్దరు స్పిన్నర్లు ఉంటారు. చహల్ తోడుగా కృనాల్ పాండ్యాను తీసుకుంటే బ్యాటింగ్‌లో కూడా పనికొస్తాడు. పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్ ఖాయం కాగా చేతన్ సకారియాకు చోటు దక్కొచ్చు. అయితే అతడికి సైనీ నుంచి పోటీ ఎదురుకానుంది.

భారత జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.


Click it and Unblock the Notifications












