
గువహటి: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తోన్న ఈ యువ క్రికెటర్ రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ బాదాడు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన పృథ్వీ షా(383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లతో 379) వన్డే తరహా బ్యాటింగ్‌తో కెరీర్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. క్వాడ్రాపుల్ సెంచరీ(400) కూడా చేసేలా కనిపించిన ఈ ముంబై క్రికెటర్.. 21 పరుగుల దూరంలో ఔటయ్యాడు. అయినా ముంబై తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా షా సరికొత్త చరిత్రను సృష్టించాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రెండో భారత క్రికెటర్‌గా పృథ్వీ షా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు మహారాష్ట్రకు చెందిన నింబాల్కర్ పేరిట ఉంది. 1948-49 రంజీ సీజన్లో అతను సౌరాష్ట్రపై 443 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పటి వరకూ రెండో స్థానంలో ఉన్న సంజయ్ మంజ్రేకర్ (377)ను పృథ్వీ షా తాజా ఇన్నింగ్స్‌తో వెనక్కి నెట్టాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి 240 పరుగులతో నాటౌట్‌గా ఉన్న పృథ్వీ షా.. రెండు రోజు ట్రిపుల్ సెంచరీ సాధించాడు. భారత్ తరఫున 2021 జూలైలో చివరి మ్యాచ్ ఆడిన పృథ్వీ గత ఏడాదిన్నరగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. దేశవాళీ, ఐపీఎల్‌లో సత్తా చాటినా సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. దాంతో మరింత కసిగా ఆడిన పృథ్వీ షా.. అసోంపై ట్రిపుల్ సెంచరీ బాదడం ద్వారా సెలక్టర్లు తన వైపు కచ్చితంగా చూడాల్సిన పరిస్థితిని కల్పించాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ అజింక్య రహానే సైతం సెంచరీతో సత్తా చాటాడు. దాంతో ముంబై భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ, విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా పృథ్వీ షా చరిత్రకెక్కాడు. రంజీల్లో ట్రిపుల్ సెంచరీ బాదిన పృథ్వీ షా పేరును ఆస్ట్రేలియాతో జరగనున్న అప్‌కమింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సెలక్టర్లు పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 41 మ్యాచ్‌ల్లో 72 ఇన్నింగ్స్‌లు ఆడిన షా... 3623 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉండగా.. అతని యావరేజ్ 51.75గా ఉంది. వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో ఆడే పృథ్వీ షాను భారత జట్టులోకి తీసుకొని వరుసగా అవకాశాలు ఇవ్వాలని గౌతమ్ గంభీర్, ఆకాశ్ చోప్రా, వసీం జాఫర్ వంటి మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నా టీమిండియా మేనేజ్‌మెంట్ పట్టించుకోవడం లేదు.