టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున పృథ్వీ షా(26 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్ తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నా.. విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబైకి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.
పృథ్వీ షాకు తోడుగా అజింక్య రహానే(45 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు భారీ స్కోర్ చేసింది. విదర్భ బ్యాటర్లలో అథర్వ తైడే(41 బంతుల్లో 66), అపూర్వ్ వాంఖడే(33 బంతుల్లో 51), శుభమ్ దూబే(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43) రాణించారు. ముంబై బౌలర్లలో అథర్వ అంకోలేకర్(2/32), సుర్యాన్ష్ షెద్గే(2/36) రెండేసి వికెట్లు తీయగా.. తనూష్ కోటియన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం ముంబై పృథ్వీ షా, అజింక్యా రహానే అసాధారణ బ్యాటింగ్‌తో 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి గెలుపొందింది. పృథ్వీ షా, అజింక్యా రహానే తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(5), సూర్యకుమార్ యాదవ్(9) విఫలమవ్వగా.. శివమ్ దూబే(37 నాటౌట్), సూర్యాన్ష్ షెద్గే(36 నాటౌట్) సత్తా చాటారు. విదర్భ బౌలర్లలో దిపేష్(2/32) రెండు వికెట్లు తీయగా.. హర్ష్ దూబే, యష్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా నిలిచిన పృథ్వీ షా.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా పృథ్వీ షా ఫిట్‌నెస్ తీవ్ర చర్చనీయాంశమైంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణిస్తుండటంతో పృథ్వీ షాను ఏ జట్టు అయినా తీసుకునే ఛాన్స్ ఉంది.