పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరమైన టీమిండియా వెటరన్ బ్యాటర్ పృథ్వీ షా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రోఫెషనల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంపై ఫోకస్ పెట్టిన పృథ్వీ షా.. అందులో భాగంగా దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు. అప్‌కమింగ్ దేశవాళీ సీజన్‌లో మరో జట్టు తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్నాడు. ఇప్పటికే అతను ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఓసీ)ని కోరినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. పృథ్వీ షా ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నాడని, త్వరలోనే తుది నిర్ణయం వెల్లడిస్తామని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపినట్లు తమ కథనంలో రాసుకొచ్చింది.ఇప్పటికే ఇతర రాష్ట్రాల జట్ల నుంచి పృథ్వీ షాకు ఆఫర్ వచ్చినట్లు కూడా ప్రస్తావించింది.
2018 అండర్ 19 ప్రపంచకప్‌తో భారత జట్టులోకి దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. మరో సెహ్వాగ్ అవుతాడని విమర్శకుల ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా నిలిచాడు. తన సారథ్యంలో అండర్ 19 ప్రపంచకప్ ఆడిన శుభ్‌మన్ గిల్.. టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా ఎదిగాడు. అర్ష్‌దీప్ సింగ్ ప్రధాన పేసర్‌గా మారాడు.కానీ పృథ్వీ షా.. చిన్న వయసులోనే వచ్చిన డబ్బుతో ఆటను పక్కనపెట్టాడు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో పాటు క్రమశిక్షణ లేమితో ఆటకు దూరమయ్యాడు.

తన తప్పిదం తెలుసుకొని ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన పృథ్వీ షా.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అతన్ని గాయాలు వెంటాడాయి. దేశవాళీ క్రికెట్‌లోనూ ముంబై జట్టులో పోటీ ఎక్కువవ్వడంతో పృథ్వీ షాకు అవకాశం లేకుండా పోయింది. గతేడాది విజయ్‌హజారే ట్రోఫీకి అతన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎంపిక చేయలేదు.దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పృథ్వీ షా సెలెక్టర్లపై సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.
'ఓరి దేవుడా.. నేను ఇంకేం చేయాలి. 65 ఇన్నింగ్స్‌లు.. 3399 పరుగులు.. 55.7 సగటు.. స్ట్రైక్‌రేట్ 126 నమోదు చేసినా.. నా ఎంపికకుఇవి సరిపోలేదు. అయినా నీ(దేవుడి)పై నా నమ్మకం సడలదు. ప్రజలు కూడా నన్ను విశ్వసిస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే నేను ఖచ్చితంగా పునరాగమనం చేస్తాను. ఓం సాయిరామ్' అని ఇన్‌స్టా స్టోరీలో పృథ్వీ షా రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై ఎంసీఏ వర్గాలు ఘాటుగా స్పందించాయి. పృథ్వీ షా ఫిట్‌గా లేడని, ఎమ్‌సీఏ పెట్టిన పరీక్షలో అతను నెగ్గలేదని తెలిపాయి. అతని శరీరంలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉందని, సరిగ్గా ఫీల్డింగ్ కూడా చేయలేకపోతున్నాడని ఎమ్‌సీఏ వర్గాలు ఆరోపించాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలోనే మరో జట్టుకు ఆడటం ఉత్తమమని పృథ్వీ షా భావిస్తున్నాడు.