ధర్మశాల: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా తన వరుస వైఫల్యాలకు చెక్ పెట్టాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. సీజన్ ఆరంభంలో పేలవ బ్యాటింగ్‌తో తుది జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా.. పంజాబ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. 36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అనంతరం రెండు చేతులను ఢిల్లీ డగౌట్ వైపు చూపిస్తూ వింతగా సంబరాలు చేసుకున్నాడు. పృథ్వీ షా సెలెబ్రేషన్స్ చూసి అంతా షాకయ్యారు. ఆ సెలెబ్రేషన్స్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలియక అయోమయానికి గురయ్యారు. ఇన్నింగ్స్ అనంతరం ఈ సెలెబ్రేషన్స్‌పై పృథ్వీ షాను వివరణ కోరగా.. అసలు కారణం చెప్పాడు.

పంజాబ్ కింగ్స్ పేసర్లు వేసిన బౌన్సర్లతో తన రెండు చేతులకు గాయాలయ్యాయని, అదే విషయాన్ని తమ డగౌట్ తెలియజేసానన్నాడు. రెండు చేతులకు దెబ్బలు తగిలినా హాఫ్ సెంచరీ సాధించాననే సంతోషాన్ని వారితో పంచుకున్నానని చెప్పాడు. చాలా రోజుల తర్వాత పరుగులు చేయడం సంతోషంగా ఉందన్నాడు.
'చాలా రోజుల తర్వాత హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ప్రతిఫలం దక్కదు. కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. బంతి ముద్దుగా బ్యాట్‌పైకి వస్తుంది.
అయితే కొత్త బంతి కాస్త స్వింగ్ అవుతుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే డ్యూ ఉంది. గ్యాప్‌ను రాబడుతూ ఆడితే చెలరేగవచ్చు. చేతి వేళ్లకు బంతి బలంగా తాకింది. అది పెద్ద గాయమేమి కాదు. ఇది మంచి స్కోర్. పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉంది. లెంగ్త్‌లో వేస్తే షాట్లు ఆడటం కష్టం. స్లోయర్ బాల్స్ టెన్నిస్ బాల్ బౌన్స్ అయినట్లు అవుతున్నాయి. స్లోయర్ బాల్స్ వేస్తే ఫాస్ట్ బౌలర్లు సత్తా చాటవచ్చు.'అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసింది. పృథ్వీ షా(38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54), రీలే రోసౌ(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్(31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
పంజాబ్ బౌలర్లలో సామ్ కరణ్ ఒక్కడే 2 వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులే చేసి ఓటమిపాలైంది. లియామ్ లివింగ్ స్టోన్(48 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 94 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగినా ఫలితం లేకపోయింది.
లివింగ్ స్టోన్‌కు తోడుగా అథర్వ టైడే(42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్జ్ రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.