ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించినది కాదు.. నాకంత తల పొగరు లేదు: పృథ్వీ షా

న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికగా తాను చేసే పోస్ట్‌లు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కాదని, అవి పూర్తిగా తన వ్యక్తిగతమని టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా అన్నాడు. రంజీ ట్రోఫీలో అస్సాంపై ట్రిపుల్ సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించిన పృథ్వీ షా.. భారత సెలెక్టర్లకు తన ఆటతో స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. రంజీ క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్‌గా నిలిచిన పృథ్వీ షా.. ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. 2021 జూలైలో టీమిండియా తరఫున చివరిసారిగా ఆడిన పృథ్వీ షా.. రీఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. దేశవాళీ, ఐపీఎల్‌లో సత్తా చాటినా సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు.

సాయిబాబాను ఉద్దేశించే..
చివరకు భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కూడా అతన్ని ఎంపిక చేయలేదు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పృథ్వీ షా ట్విటర్ వేదికగా తన అసంతృప్తి వెళ్లగక్కాడు. ఇన్‌స్టా స్టోరీలో సాయిబాబా అంటూ చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో 'సాయిబాబా.. అంతా నువ్వు చూస్తూనే ఉంటావని ఆశిస్తున్నా.'అని పృథ్వీ షా షేర్ చేశాడు. సెలక్టర్లను ఉద్దేశించే షా ఈ పోస్ట్ చేశాడని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ పోస్ట్ ఎవరినీ ఉద్దేశించి చేసింది కాదని తాజాగా షా స్పష్టం చేశాడు. 'లేదు. అప్పుడు నేను చేసిన సాయిబాబా పోస్టు ఎవరినీ ఉద్దేశించి చేసింది కాదు. అది కేవలం సాయిబాబా చూస్తున్నాడో లేదో అని చేశా. అది నా పర్సనల్.'అని చెప్పాడు.

ఆ మాటలను పట్టించుకోను..
ఇక సోషల్ మీడియా వేదికగా తనపై జరిగే ట్రోలింగ్‌ను పట్టించుకోనని పృథ్వీ షా స్పష్టం చేశాడు. 'పేరు ప్రఖ్యాతులు, డబ్బు వల్ల నాకు తల పొగరు వచ్చిందని విమర్శించే వాళ్లూ ఉన్నారు. కొంతమంది తమకు ఏం అనిపిస్తే అది సోషల్ మీడియాలో రాసుకొస్తారు. నిజానికి అలాంటి వాళ్లు నన్ను నేరుగా కలిసి మాట్లాడేదేమీ ఉండదు. కానీ.. పిచ్చి రాతలు రాస్తారు. అయితే, నేను వాటిని పట్టించుకోను. నా పని నేను చేసుకుంటా. కొన్నిసార్లు అలాంటి కామెంట్లు నా దృష్టికి వచ్చినా తేలికగా తీసుకుంటా. వాళ్లతో నాకు పనిలేదు. ఆటగాడిగా ఎలా ఒక్కో మెట్టు ఎక్కాలి? ఆటకు మెరుగులు దిద్దుకోవాలంటే ఏం చేయాలి? అన్న అంశాల మీదే నా దృష్టి ఉంటుంది'' అని పృథ్వీ షా స్పష్టం చేశాడు.

ఆ విషయంలో బాధపడుతా..
అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినా సెలెక్టర్లు పట్టించుకోకపోతే తీవ్రంగా బాధపడుతానని పృథ్వీ షా వెల్లడించాడు.'అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా.. సెలక్టర్లు నా పేరు పరిగణనలోకి తీసుకోకపోతే కచ్చితంగా బాధపడుతా. అయితే, మన ఆధీనంలో లేని అంశాల గురించి ఎక్కువగా ఆలోచించినా ప్రయోజనం ఉండదు. మనకు ఏం ఇవ్వాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. ఒకవేళ ఆయన దయతలిస్తే మళ్లీ టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తుంది. అయితే, ఇప్పుడు నా దృష్టి మాత్రం రంజీ మీదే ఉంది. ముంబైని విజేతగా నిలపడంలో నా వంతు కృషి చేయాలి అని భావిస్తున్నా'అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.

జై షా ప్రశంసలు..
ట్రిపుల్ సెంచరీ బాదిన పృథ్వీ షాను ట్విటర్ వేదికగా బీసీసీఐ సెక్రటరీ జై షా అభినందించాడు. 'రికార్డు పుస్తకాల్లోకి మరో ఘనత వచ్చి చేరింది. పృథ్వీ షా ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రంజీ ట్రోఫీ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన పృథ్వీ షాకు అభినందనలు. దమ్మున్న ఆటగాడు పృథ్వీ షా. అతని ప్రదర్శన గర్వంగా ఉంది'అని జైషా ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన పృథ్వీ షా.. జై షాకు కృతజ్ఞతలు తెలిపాడు. 'మీ మాటలు నా ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. మరింత కఠినంగా శ్రమించేలా ప్రోత్సహిస్తున్నాయి' అని పృథ్వీ బదులిచ్చాడు. జై షా ట్వీట్ చర్చనీయాంశమైంది. టీమిండియా రీఎంట్రీకి పృథ్వీకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications