పృథ్వీ షా క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి సముద్రపు అలలా దూసుకొచ్చిన ఈ యువ కెరటం.. అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయాడు. అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లో శతకం బాది అందరి మన్ననలు అందుకున్న పృథ్వీ షా.. గాయల బెడద, బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపం, అనవసరపు వివాదాలతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు.
అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత జట్టులోకి వచ్చిన ఈ ముంబై కుర్రాడు.. ఐదు టెస్ట్‌లు, 6 వన్డేలు, ఒక టీ20లో మాత్రమే భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌లో సంచలన బ్యాటింగ్‌తో చెలరేగినా.. కీలక సమయంలో గాయపడటం.. అనవసర వివాదాల్లో ఇరుక్కోవడంతో భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేకపోతున్నాడు.

అతను భారత జట్టుకు దూరమై దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తోంది. గతేడాది యూట్యూబర్, నటి సప్నా గిల్‌తో పబ్లిక్‌గా జరగిన గొడవతో పృథ్వీ షా.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన పృథ్వీ షా ఈ గొడవకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సెల్ఫీ నిరాకరించానని తనపై దాడి చేశారని చెప్పుకొచ్చాడు.
ఈ అనూహ్య ఘటనతో జీవితంలో తాను తొలిసారి భయపడ్డానని, వారు చంపేస్తారనుకున్నానని తెలిపాడు. 'ఆ రోజు నేను 7-8 మంది స్నేహితులతో కలిసి ముంబై సహారా స్టార్ హోటల్‌లోని బర్రెల్ క్లబ్‌కు వెళ్లాను. మా పక్కన టేబుల్‌పై కూర్చున్న నలుగురు, ఐదుగురు వ్యక్తులు నా దగ్గరకు సెల్ఫీ కోసం వచ్చారు.
ఫొటోలు సరిగ్గా రాలేదని మరోసారి సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఒక జంట నా భుజాలపై చేతులు వేసి అనుమతి లేకుండా వీడియో తీయడం మొదలుపెట్టింది. దానికి నేను అభ్యంతరం చెప్పాను. వెంటనే మాకు కలిగిన అసౌకర్యాన్ని గుర్తించిన హోటల్ మేనేజర్ వారిని బయటకు పంపించాడు. ఆ తర్వాత కాసేపటికి నేను కూడా హోటల్ ముందు గేట్ నుంచి బయటకు వచ్చాను.
బయట సప్నా గిల్ బేస్ బాల్ బ్యాట్‌తో నిల్చొని ఉంది. ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్న వారు మాములు మనషుల్లా కనిపించలేదు. బయట నా కోసం ఎదురు చూస్తున్నారు. సీఐఎస్‌ఎఫ్ చెక్ పోస్ట్ వద్ద స్లో చేయగానే నా కారుపై బేస్ బాల్ బ్యాట్‌తో దాడి చేశారు. కారు అద్దాలపై 3-4 సార్లు గట్టిగా కొట్టారు. కారు అద్దం పగిలిపోతుందేమోనని నేను భయపడ్డాను.
వెంటనే కారు బయటకు వచ్చి ఆమె చేతిలోని బేస్ బాల్ బ్యాట్ లాగేసాను. లేకపోతే ఆమె నా కారును పూర్తిగా నాశనం చేసేది. ఆమె చేతిలో నుంచి బ్యాట్ లాక్కునే వీడియోను మాత్రమే సోషల్ మీడియా పంచుకుంది. ఆ వీడియోనే వైరల్‌గా మారింది. నేను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్నా. ఈ అనవసరపు వివాదంలో నా పేరును ఉంచుకునేందుకు నేను ఇష్టపడలేదు.
దాంతో నా స్నేహితుల కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాను. నా బీఎమ్‌డబ్ల్యూ కారు అక్కడే వదిలేసాను. నా స్నేహితులు కారును ఇంటికి తీసుకొస్తారని చెప్పడంతో వెళ్లిపోయాను. ఈ అనూహ్య ఘటన కారణంగా జీవితంలో తొలిసారి నేను భయపడ్డాను. ఆ సమయంలో వారు నన్ను చంపేస్తారనుకున్నా. అనంతరం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను.
ఈ వివాదంలో నా పేరు లాగుతారని తెలిసి కూడా కేసు పెట్టాను. మేం ఏం తప్పు చేయలేదనే దైర్యంతోనే పోలీసులను ఆశ్రయించాం. నా స్నేహితులు ఎవరూ కూడా సప్నా గిల్‌ను తాకలేదు. ఆమె కేసును తన ఫేవర్‌గా మార్చుకునేందుకు అసత్య ఆరోపణలు చేసింది. ముంబై పోలీసులు సైతం కోర్టుకు ఇదే విషయాన్ని చెప్పారు.
అక్కడ ఉన్న అన్నీ కెమెరాల్లో చెక్ చేసుకోవాలని కూడా మేం పోలీసులతో పాటు కోర్టుకు తెలియజేశాం.'అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న పృథ్వీ షా.. ఐపీఎల్ 2024 సీజన్‌తో మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు.