దీనమ్మ జీవితం.. బరువు తగ్గినా సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు: పృథ్వీ షా

న్యూఢిల్లీ: భారత సెలెక్టర్లపై సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా విమర్శలు గుప్పించిన యువ ఓపెనర్ పృథ్వీషా.. తాజాగా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసిన ద్వితీయ శ్రేణి జట్టులో కూడా తనకు అవకాశం ఇవ్వకపోవడంపై పృథ్వీ షా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ప్రధాన క్రికెటర్లతో కూడిన భారత టీ20 జట్టు టీ20 వరల్డ్‌కప్ 2022 కోసం ఇప్పటికే ఆస్ట్రేలియాకి వెళ్లగా.. శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని సెకండ్ ఛాయిస్ టీమ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ వన్డే సిరీస్ కోసం రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ తదితర క్రికెటర్లకి ఛాన్స్ ఇచ్చిన భారత సెలెక్టర్లు.. పృథ్వీ షాని మాత్రం విస్మరించారు.
చాలా నిరాశకు గురయ్యా..
ఈ క్రమంలోనే సెలెక్టర్లు నమ్మించి మోసం చేశారని పరోక్షంగా విమర్శించిన పృథ్వీ షా తాజాగా మిడ్‌డే దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అసహనాన్ని వెళ్లగక్కాడు. 'దేశవాళీ క్రికెట్‌లో బాగానే రన్స్ చేస్తున్నా. కానీ.. నాకు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అవకాశం ఇవ్వకపోడం చాలా నిరాశకు గురిచేసింది.
అయినా ఏం బాధపడటం లేదు.. ఎప్పుడైతే భారత సెలెక్టర్లు నేను ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని భావిస్తారో .. అప్పుడే నాకు అవకాశం ఇస్తారనుకుంటున్నా. నేను కూడా ఎప్పుడు ఛాన్స్ దక్కినా.. అది భారత్ జట్టు లేదా భారత-ఎ జట్టు లేదా ఏ టీమ్ అయినా సత్తాచాటేందుకు ప్రయత్నిస్తా.

ఇష్టమైన స్వీట్లు, కూల్ డ్రింక్స్..
నేను ఇప్పటికే ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాను. నా బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు లేవు, అయితే ఫిట్‌నెస్ లేదని నన్ను పక్కనబెడుతున్నారు. అందుకే బరువు తగ్గడంపై పూర్తి ఫోకస్ పెట్టాను. ఐపీఎల్ 2022 తర్వాత ఏడు నుంచి 8 కిలోల వరకూ బరువు తగ్గాను. జిమ్‌లో చాలా సమయం గడుపుతున్నాను.
రన్నింగ్ చేస్తున్నా. నాకెంతో ఇష్టమైన స్వీట్స్ తినడం కూడా మానేశాను. కూల్ డ్రింక్స్ కూడా తాగడం లేదు. చైనీస్ ఫుడ్‌ని కూడా నా మెనూ నుంచి తీసేశాను. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో నా పర్ఫామెన్స్, టీమ్‌కి సెలక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా.'అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.

36/9 పరాభావంతో..
అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత జట్టులోకి దూసుకొచ్చి పృథ్వీ షా.. ఇప్పటి వరకు టీమిండియా తరుపున 4 టెస్టులు, 6 వన్డేలు ఆడాడు. వెస్టిండీస్‌పై ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ సాధించాడు. టెస్టుల్లో మరో రెండు హాఫ్ సెంచరీలు కూడా చేసిన పృథ్వీ షా... వన్డేల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు.
2020 ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడిలైడ్ టెస్టు తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆడిలైడ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన పృథ్వీ షా.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 36/9 స్కోరుకే పరిమితమై దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఈ దారుణ వైఫల్యం నేపథ్యంలో పృథ్వీ షాపై బీసీసీఐ వేటు వేసింది.

శుభ్‌మన్ గిల్ రాకతో..
యంగ్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్‌ని రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయించింది. గిల్ సక్సెస్, పృథ్వీ షాని టీమిండియాలోకి రాకుండా గేట్లు మూసేసినట్టైంది. గిల్ నిలకడగా రాణిస్తుండటంతో పృథ్వీషాను సెలెక్టర్లు పట్టించుకోవడం మానేసారు. ఐపీఎల్‌లో సత్తా చాటినా.. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా.. అతనికి అవకాశం ఇవ్వలేదు.
సెహ్వాగ్ శైలిలో ఆడే పృథ్వీ షా టీమిండియా స్టార్ ప్లేయర్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ జట్టులో నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా అతను ఐపీఎల్‌కే పరిమితమవుతున్నాడు. అయితే పృథ్వీ షా కనీసం భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కూడా పనికిరాడా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications