ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2025-26కి బుధవారం(అక్టోబర్ 15) తెరలేచింది. వెటరన్ క్రికెటర్లతో పాటు యువ ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. అయితే టీమిండియా వెటరన్ బ్యాటర్ పృథ్వీ షాకు మాత్రం ఈ టోర్నీలో ఆశించిన ఆరంభం దక్కలేదు. తనకు కెరీర్ ఇచ్చిన ముంబై జట్టును కాదని మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పృథ్వీ షా ఆ జట్టు తరఫున అరంగేట్ర రంజీ మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఎలైట్ గ్రూప్-బీలో భాగంగా తిరవునంతపురం వేదికగా కేరళతో బుధవారం ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో పృథ్వీ షా 4 బాల్ డక్‌గా వెనుదిరిగాడు. కేరళ పేసర్ నిధీష్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షాతో పాటు మరో ముగ్గురు బ్యాటర్లు వరుసగా డకౌటవ్వడం గమనార్హం. పేస్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై కేరళ పేసర్ నిదీష్ నిప్పులు చెరిగాడు. తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా(0)తో పాటు సిద్దేష్ వీర్(0)లను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు.

నెడుమంకుజి బసిల్ వేసిన మరుసటి ఓవర్ తొలి బంతికి అర్షిన్ కులకర్ణి(0) గోల్డెన్ డక్ కాగా.. నిదేశ్ మరుసటి ఓవర్‌లో సిద్దేష్ వీర్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో మహారాష్ట్ర 5 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే ఆచితూచి ఆడిన సౌరభ్ నవాలే(12)ను కూడా నిదేష్ ఔట్ చేయడంతో మహారాష్ట్ర 18 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన జలజ్ సక్సెనా(29 బ్యాటింగ్) సాయంతో రుతురాజ్ గైక్వాడ్(35 బ్యాటింగ్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ముంబై క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్లు, అధికారులతో నెలకొన్న విభేదాలతో పృథ్వీ షా ఆ జట్టు నుంచి బయటకు వచ్చాడు. మహారాష్ట్ర తరఫున బుచ్చిబాబు టోర్నీ అరంగేట్ర మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీకి ముందు ముంబైతో జరిగిన వామప్ మ్యాచ్‌లోనూ భారీ శతకం సాధించాడు. తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. తనను ఔట్ చేసిన ముషీర్ ఖాన్‌ను బ్యాట్‌తో కొట్టబోయి వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ అనంతరం ముషీర్ ఖాన్‌కు క్షమాపణలు కూడా చెప్పాడు. రంజీ ట్రోఫీలో సత్తా చాటి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని పృథ్వీ షా భావిస్తున్నాడు. కానీ అతనికి ఆశించిన రీతిలో శుభారంభం దక్కలేదు.