
ముంబై: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా చిక్కుల్లో పడ్డాడు. అతనిపై యూట్యూబర్, బోజ్‌పురి నటి సప్నా గిల్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పృథ్వీ షానే మద్యం మత్తులో తన స్నేహితులపై దాడి చేయడంతో పాటు తనను తప్పుడు కేసులో ఇరికించి పరువు భంగం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొంది. గతవారం సెల్ఫీ కోసం పృథ్వీ షాపై సప్నా గిల్, ఆమె స్నేహితులు దాడి చేసిన విషయం తెలిసిందే.
స్నేహితులతో కలిసి ఓ హోటల్‌కు వచ్చిన పృథ్వీ షా సెల్ఫీ నిరాకరించడని అతనితో దురుసుగా ప్రవర్తించడమే కాక, స్నేహితుడి కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బేస్ బాల్ బ్యాట్‌తో పృథ్వీ షాపై దాడికి ప్రయత్నించారు. ఈ దాడిని అడ్డుకున్న పృథ్వీ సప్నా గిల్ చేతిలోని బేస్ బాల్ బ్యాట్ లాక్కొని పక్కనపడేయడం వీడియోలో కనిపించింది.
ఈ ఘటనకు సంబంధించి సప్నా గిల్ సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సప్నా గిల్‌కు ముంబై కోర్టు మూడు రోజుల కస్టడీ విధించగా.. అది సోమవారం నాటికి ముగియడంతో ఆమెకు బెయిల్ లభించింది. ఇక బయటకు వచ్చిన సప్నా.. సోమవారం అంధేరీ పోలీసు స్టేషన్‌లో పృథ్వీ షా, అతని స్నేహితులపై ఫిర్యాదు చేసింది.
'నా స్నేహితుడితో కలిసి నేను హోటల్‌కు వెళ్లగా అక్కడ పృథ్వీ షా తన స్నేహితులతో కన్పించాడు. నా స్నేహితుడు ఓ టీనేజర్ కావడంతో పాటు క్రికెట్ అభిమాని కావడంతో సెల్ఫీ కోసం వాళ్ల వద్దకు వెళ్లాడు. అప్పటికే పృథ్వీ సహా అతని స్నేహితులు మద్యం మత్తులో ఉన్నారు. వారు నా స్నేహితుడి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. వారు అతనిపై చేయి చేసుకున్నారు. అందువల్లే నేను వారితో గొడవపడాల్సి వచ్చింది.
నా స్నేహితుడిని రక్షించేందుకే నేను మధ్యలోకి వెళ్లాను. నా ఫ్రెండ్‌కు ఏమనవద్దని పృథ్వీషాను వేడుకున్నా. కానీ, వారు వినిపించుకోలేదు. పైగా నేను దాడి చేశానని అంటూ నాపై తప్పుడు కేసు పెట్టారు'అని సప్నా గిల్ తన ఫిర్యాదులో పేర్కొంది. తన పరువు, మర్యాదలకు భంగం కలిగించినందుకు గానూ పృథ్వీ షా, అతని స్నేహితులపై కేసు నమోదు చేయాలని కోరింది. అయితే దీనిపై పోలీసులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.