హైదరాబాద్: టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో రెండు వేర్వేరు దేశాల్లో డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు నమోదు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్న పృథ్వీ షా.. వన్డేకప్-2023 టోర్నీలో విధ్వంసకర డబుల్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.
ఈ టోర్నీలో నార్తాంప్టన్ షైర్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. బుధవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 153 బంతుల్లో 244 పరుగులు చేశాడు. పృథ్వీ షా ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు, 11 సిక్స్‌లతో మొత్తం 39 బౌండరీలు ఉండటం విశేషం. 2020-21 విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున 227 పరుగుల చేసిన పృథ్వీ షా.. తాజా ద్విశతకంతో రెండు దేశాల్లో ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు.

వన్డే కప్‌లో ఓలీ రాబిన్సన్ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోర్ 206 పరుగులను పృథ్వీ షా అధిగమించాడు. లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. పురుషుల లిస్ట్ క్రికెట్‌లో అత్యధిక బౌండరీలు బాదిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు.
ఇంగ్లండ్ లిస్ట్ ఏ క్రికెట్‌లో ఇది రెండో వ్యక్తిగత స్కోర్. 2002 గ్లోకోస్టర్ ట్రోఫీలో అలీ బ్రాన్స్ 268 రన్స్ చేశాడు. అత్యధిక లిస్ట్ ఏ డబుల్ సెంచరీలు కలిగిన రెండో భారత ప్లేయర్‌గా పృథ్వీ షా రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ ముందున్నాడు. వన్డే కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పృథ్వీ షా.. చతేశ్వర్ పుజారాను అధిగమించాడు.
ఇక పృథ్వీ షా ఇన్నింగ్స్‌తో అతని ఇష్ట దైవం సాయిబాబానే షాకయ్యాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో నార్తాంప్టన్‌షైర్ 87 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై మాట్లాడిన పృథ్వీ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'భారత సెలెక్టర్లు నా గురించి ఏం అనుకుంటున్నారని అస్సలు ఆలోచించడం లేదు. నా ఆటను ఆస్వాదించడంపై మాత్రమే ఫోకస్ పెట్టాను.
ఇక్కడి ఆటగాళ్లు, సహాయక బృందంతో చక్కటి సమయం గడుపుతున్నాను. నార్తంప్టన్‌షైర్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. వారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నేను ఆటను ఆస్వాదిస్తున్నాను. 'అని చెప్పుకొచ్చాడు.