
చెన్నై: ఐపీఎల్ 2021 మినీ వేలం సందర్భంగా కింగ్స్ పంజాబ్ కో ఓనర్ ప్రీతీ జింటా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ సహా యజమాని షారుఖ్ ఖాన్ తనయుడిని టీజ్ చేసింది. తమిళనాడు క్రికెటర్ షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 5.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ సహా యజమాని, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ పేరు పెట్టుకున్న ఈ ఆటగాడి కనీస ధర రూ.20 లక్షలు కాగా.. పంజాబ్ కింగ్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ తమిళనాడు హిట్టర్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా పోటీపడింది.
అయితే క్రికెటర్ షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకోగానే షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ వైపు తిరిగిన ప్రీతీ జింటా.. 'మేం షారుఖ్‌ను సొంతం చేసుకున్నాం.. ఆర్యన్'అంటూ టీజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ఇక షారుఖ్ ఖాన్ ఇప్పుడు పంజాబ్ కింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ మినీ వేలం బ్రేక్ టైమ్‌లో నటుడు షారుఖ్ ఖాన్‌తో ప్రీతీ జింటా వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ ఫొటోను పంజాబ్ కింగ్స్ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కూడా ఉన్నాడు. ఆర్యన్‌తో పాటు కేకేఆర్ సహా యజమాని జూహీ చావ్లా కూతురు జాహ్నవి మెహతా కూడా వేలంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.