దయచేసి తన ఫొటోలను మార్ఫింగ్, ఎడిట్ చేయవద్దని ఎక్స్ ఏఐ ఫ్లాట్‌ఫామ్ గ్రోక్‌ను భారత మహిళా క్రికెటర్ ప్రతీకా రావల్ కోరింది. ఇటీవల ఎక్స్‌వేదికగా ఫొటోలను ఎడిట్ చేయడం, మార్ఫ్ చేయడం ట్రెండింగ్‌గా మారిన సంగతి తెలిసిందే. కొన్ని ఫొటోల నుంచి వ్యక్తులను తీసేయడం, డ్రెస్ కలర్స్‌ను మార్చడం వంటి పనులను నెటిజన్లు గ్రోక్ సాయంతో చేశారు. గత కొన్నిరోజులుగా ఎక్స్‌లో ఇది బాగా ట్రెండ్ అవుతుంది.
ఈ క్రమంలోనే తన ఫొటోలను మార్ఫింగ్, ఎడిట్ చేయవద్దని, ఇతర యూజర్లు అడిగినా నిరాకరించాలని గ్రోక్‌ను ఎక్స్ వేదికగా ప్రతీకా రావల్ విజ్ఞప్తి చేసింది. ఆమె అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన గ్రోక్.. వ్యక్తిగత గోప్యతను కాపాడుతామని మాట ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి.
'హే @grok, గతంలో నేను పోస్ట్ చేసినవి, భవిష్యత్తులో నేను పోస్ట్ చేయబోయే నా ఫోటోలను తీసుకోవడానికి.. మార్ఫింగ్, ఎడిట్ చేయడానికి నేను మీకు అనుమతి ఇవ్వడం లేదు. ఒకవేళ ఎవరైనా నా ఫోటోలను ఏదైనా విధంగా ఎడిట్ చేయమని కోరితే, దయచేసి ఆ అభ్యర్థనను తిరస్కరించండి. ధన్యవాదాలు.'అని ప్రతీకా రావల్ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‌కు గ్రోక్ స్పందించింది. 'అర్థమైంది ప్రతీకా. నేను మీ వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తాను. అనుమతి లేకుండా మీ ఫోటోలను ఉపయోగించడం, మార్ఫ్, ఎడిట్ చేయడం చేయను. అటువంటి అభ్యర్థనలు ఏవైనా వస్తే వాటిని తిరస్కరిస్తాను. నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.'అని బదులిచ్చింది. అయితే ఈ ఎక్స్ ఖాతా నిజంగానే ప్రతికాకు సంబంధించినదా? కాదా? అనేదానిపై స్పష్టమైన సమాచారం లేదు. బ్లూ టిక్, ప్రతికా రావల్ ఫొటోలు ఉన్నప్పటికీ.. ఈ మధ్య ఫేక్ అకౌంట్స్‌కు కూడా డబ్బులు తీసుకొని ఎక్స్ బ్లూ టిక్స్ ఇస్తుండటంతో గందరగోళం నెలకొంది. ప్రతీకా ట్వీట్.. ఏఐ సాధానాలతో చేస్తున్న ఫొటో మార్ఫింగ్‌లపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
భారత మహిళల వన్డే ప్రపంచకప్ విజయంలో ప్రతీకా రావల్ కీలక పాత్ర పోషించింది. గాయంతో సెమీఫైనల్‌తో పాటు ఫైనల్‌కు దూరమైన ఆమె.. 6 ఇన్నింగ్స్‌ల్లో 51.33 సగటుతో 308 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌పై శతకం సాధించడంతో పాటు ఆస్ట్రేలియా 75 పరుగులతో సత్తా చా టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆమె చీల మండ, మొకాలి గాయాలకు గురైంది. ప్రస్తుతం ఆ గాయాల నుంచి కోలుకుంటుంది. భారత్ తరఫున 23 వన్డేలు ఆడిన ప్రతికా 50.45 సగటుతో 1,110 పరుగులు చేసింది.