ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో గాయపడ్డ టీమిండియా తాత్కలిక కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు ఆట మధ్యలో బుమ్రా మైదానం వీడిన విషయం తెలిసిందే. లంచ్ బ్రేక్ అనంతరం ఒకే ఒక ఓవర్ వేసిన బుమ్రా.. ఆకస్మాత్తుగా మైదానం వీడాడు. అతన్ని టీమ్ ఫిజియోలు స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అయితే బుమ్రా గాయంపై ఎలాంటి క్లారిటీ లేదు. అతనికి ఏం గాయమైంది..ఎందుకు మైదానం వీడాడనే విషయంపై ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రసిధ్ కృష్ణను బుమ్రా గాయంపై ప్రశ్నించగా.. అతను అసలు విషయాన్ని తెలియజేశాడు. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని, స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపాడు. ప్రస్తుతం బుమ్రాను మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని, స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే మరింత క్లారిటీ వస్తుందని చెప్పాడు.

అయితే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేందుకు బుమ్రా సిద్దంగా ఉన్నాడని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. బౌలింగ్ చేసే విషయంపై రేపే స్పష్టత రానుందని, ఆదివారం అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి బౌలింగ్ చేసే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. స్కానింగ్ రిపోర్ట్స్ శనివారం సాయంత్రంలోపు వచ్చే అవకాశం ఉంది. స్కానింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుంటే భారత జట్టుకు ఊరట. ఒకవేళ అతనికి తీవ్ర గాయమైతే మాత్రం టీమిండియాకు పెద్ద దెబ్బే.
సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ చేయకపోతే.. టీమిండియా తీవ్ర నష్టం జరగనుంది. ఈ సిరీస్ మొత్తం టీమిండియాను తన బౌలింగ్‌తోనే బుమ్రా నడిపించాడు. ఇతర బౌలర్ల నుంచి సహకారం లేకున్నా ఒంటి చేత్తో వికెట్లు తీసాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 32 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా గైర్హాజరీలో టీమిండియాను నడిపించే బాధ్యతను విరాట్ కోహ్లీకి అప్పగించారు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేయగా.. ఆసీస్ 181 పరుగులకు ఆలౌటైంది. 4 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్‌తో పాటు రవీంద్ర జడేజా ఉన్నాడు.