
హైదరాబాద్: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం 'పుష్ప-ది రైజ్' బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. దక్షిణాదిలోనే కాకుండా హిందీలోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఎంతలా ఈ సినిమా హిట్ అయ్యిందంటే.. టీమిండియా ఆటగాళ్లు కూడా ప్రత్యేకంగా ఈ సినిమాను చూసేంత బ్లాక్‌బస్ట్ ర్ అయ్యింది. వెండితెరపై కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతుంది. నిర్ణీత సమయం కన్నా ముందే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీని చూసిన టీమిండియా మాజీ స్పిన్నర్, హైదరాబాద్ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ఫిదా అయ్యాడు. అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశాడు. పుష్ప పుష్ఫ రాజ్.. నీ అవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ అయితే కేక అంటూ... అల్లు అర్జున్‌ను అభినందించాడు.
'ఒకప్పుడు 'పుష్ప.. ఎడ్వటం నాకు అస్సలు నచ్చదు' అనే డైలాగ్ పాపులర్ అయితే... ఇప్పుడు 'పుష్ప.. పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే' డైలాగ్ బ్లాక్ బస్టర్. అల్లు అర్జున్ గారు మీ కష్టాన్ని ఆస్వాదించాం.'అని ప్రజ్ఞాన్ ఓజా ట్వీట్ చేశాడు. ఇక ప్రజ్ఞాన్ ఓజాకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలుపుతూ బదులిచ్చాడు. 'థ్యాంక్యూ ప్రజ్ఞాన్ ఓజా గారు.. మీ ప్రేమకు కృతజ్ఞతలు'అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. బన్నీ అభిమానులు అయితే సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నారు. పుష్ప మూవీతో తెలుగు సినిమా గర్వపడేలా చేశాడంటూ కామెంట్ చేస్తున్నారు.
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్ ఆటగాళ్లు సైతం తొలి టెస్ట్ విజయానంతరం పుష్ప మూవీని చూసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని హనుమ విహారి అప్పట్లో ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. సినిమా చూస్తున్నంత సేపు తామంత పుష్ప ట్రాన్స్‌లోనే ఉన్నామని చెప్పిన విహారి... విలక్షణ నటుడు అల్లు అర్జున్, పుష్ప చిత్ర బృందానికి ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు అభినందనలు తెలిపారని పేర్కొన్నాడు. అంతేకాకుండా పుష్ప-2 కోసం ఎదురుచూస్తున్నట్లు విహారి చెప్పుకొచ్చాడు. ఇక డిసెంబర్17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి.. అల్లు అర్జున్ కెరియర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
థియేటర్స్‌లో విడుదలైన 22 రోజులకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'పుష్ప' స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. తెలుగు సినిమా హిస్టరీలోనే పుష్ప అత్యధిక ఓటీటీ రైట్స్‌కి అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. సుమారు రూ.27-30 కోట్లకు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్టు సమాచారం.