ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌లకు నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఇలా దారుణంగా విఫలమవడం అభిమానులను తీవ్రంగా బాధపెట్టింది. కెప్టెన్సీ మార్పు నిర్ణయమే ముంబై ఇండియన్స్ కొంపముంచిందనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేశారు. టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్ వివరణ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయంపై అభిమానులతో పాటు సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టులో విబేధాలు వచ్చాయనే ప్రచారం కూడా జరిగింది.

అయితే ఏ ఒక్క ఆటగాడి వల్ల ముంబై ఇండియన్స్ విఫలమవ్వలేదని ఆ జట్టు వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా తాజాగా వెల్లడించాడు. చాలా ఏళ్లుగా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముంబై ఇండియన్స్ వైఫల్యానికి గల కారణాలను వెల్లడించాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మూమెంటమ్ లభించలేదని, లక్ కూడా కలిసిరాలేదని చెప్పాడు. 'ఏ ఒక్క ఆటగాడి వల్ల ముంబై ఇండియన్స్ విఫలమవ్వలేదు. టీ20 క్రికెట్‌లో మూమెంటమ్ అందుకోవడం చాలా కీలకం. ఆ మూమెంటమ్ మాకు దక్కలేదు. కొన్నిసార్లు ఇలా జరగడం సహజం. కేకేఆర్‌కు లభించిన ఊపును మేం అందుకోలేకపోయాం.
ఏ ఒక్క ఆటగాడి వైఫల్యం వల్ల ముంబై ఇండియన్స్ ఓటమిపాలవ్వలేదు. మూమెంటమ్ లభించనప్పుడు పరిస్థితులన్నీ మనకు ప్రతికూలంగానే ఉంటాయి. అందుకే మాకు పరాజయాలు ఎదురయ్యాయి. పేపర్‌పై మేం చాలా బలమైన జట్టుగా ఉన్నాం. అలాంటి టీమ్ పదో స్థానంలో నిలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆటగాళ్ల వైఫల్యం కంటే మాకు లక్ కలిసిరాలేదు. మా బ్యాటర్లు ఆడిన షాట్స్ ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లాయి. మాకు కలిసొచ్చినప్పుడు అవే షాట్స్ సిక్స్‌లుగా వెళ్లాయి. బౌలర్ల పరిస్థితి కూడా అదే. క్యాచ్‌లుగా రావాల్సిన బంతులు సిక్సర్లు అయ్యాయి.'అని పియూష్ చావ్లా చెప్పుకొచ్చాడు.