టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా ప్రశంసల జల్లు కురిపించాడు. అతనో అసాధారణమైన నాయకుడని, కెప్టెన్ అని కొనియాడాడు. ప్రత్యర్థి బ్యాటర్లను ఔట్ చేసేందుకు బౌలర్లతో కలిసి వ్యూహాలు రచించడం రోహిత్ శర్మకు అలవాటని, అర్థ రాత్రి కూడా బౌలర్లతో చర్చిస్తాడని తెలిపాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐపీఎల్ సందర్భంగా రోహిత్ శర్మతో తనకు జరిగిన అను అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. అర్థ రాత్రి 2.30 గంటలకు రోహిత్ శర్మ మెసేజ్ చేశాడని చెప్పిన పియూష్ చావ్లా.. డేవిడ్ వార్నర్‌ను ఔట్ చేయడానికి గల వ్యూహాలను చర్చించాడని గుర్తు చేసుకున్నాడు.

'రోహిత్ శర్మతో కలిసి నేను ఎన్నో మ్యాచ్‌లు ఆడాను. మైదానం బయట కూడా మాట్లాడుకునే చనువు మాకు ఉంది. ఓసారి అర్థ రాత్రి 2.30 గంటలకు రోహిత్ శర్మ నాకు మేసేజ్ చేశాడు. ఆ సమయంలో నేను నిద్రపోతున్నానా? లేదా? అని తెలుసుకున్నాడు. నిద్రపోకపోతే బయటకు రావాలని, డేవిడ్ వార్నర్ ఔట్ చేసే వ్యూహంపై చర్చిద్దామని చెప్పాడు.
నేను బయటకు వెళ్లగానే ఓ పేపర్‌గా ఫీల్డ్‌ను గీసి డేవిడ్ వార్నర్‌ను ఔట్ చేయడానికి గల ప్రణాళికను నాకు వివరించాడు. ఆ సమయంలో నా నుంచి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. అతనో అసాధారణమైన నాయకుడు. సారథి. 2023 వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ 2024లో రోహిత్ శర్మ ఆడిన తీరు మిగతా బ్యాటర్లను స్వేచ్చగా ఆడే వెసులుబాటు కల్పించింది.'అని పీయూష్ చావ్లా చెప్పుకొచ్చాడు.
పియూష్ చావ్లా 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ధోనీ సారథ్యంలో భారత్ గెలిచిన 2007, 2011 ప్రపంచకప్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన పీయుష్ చావ్లా.. చివరిసారిగా టీమిండియా తరఫున 2012 డిసెంబర్‌లో ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ఐపీఎల్ ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.