
కరాచీ: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనడానికి పాకిస్థాన్ ఆటగాళ్లతో పాటు అభిమానులు, జర్నలిస్టులకు కూడా వీసాలు మంజూరు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తెలిపింది. ఈ విషయంపై మార్చి నెలాఖరులోగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ నిర్ణయం చెప్పాలని పీసీబీ చైర్మన్ ఎహ్‌సాన్ మణి అన్నారు. ఐసీసీలో పెద్దన్నలుగా ఉన్న మూడు క్రికెట్ బోర్డులు తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాలు ఇస్తామని లిఖిత పూర్వక హామీ ఇవ్వడమే కాకుండా, అభిమానులు, జర్నలిస్టులకు కూడా వీసాలు మంజూరు చేయాలన్నారు. అలా కుదరకపోతే వేదికను యూఏఈకి మార్చాలని ఐసీసీకి లేఖ రాస్తమని ఎహ్‌సాన్ మణి హెచ్చరించారు. కాగా, గత కొన్నేళ్లుగా భారత్-పాకిస్థాన్ మధ్య ధ్వైపాక్షిక క్రికెట్ జరగడంలేదన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో క్రీడా సంబంధాలు దెబ్బతిన్నాయి. కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్‌లో టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. దీనికి సంబంధించిన వీసాలను మార్చిలోగా మంజూరు చేయాలని పీసీబీ కోరుతున్నది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది.